మెగా మేనల్లుడి సినిమాకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉంటుందా..?

0

కోవిడ్ నేపథ్యంలో సినిమా థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అనుమతులు వచ్చినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కి మేకర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. అందులోనూ 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రిటర్న్స్ వస్తాయో రావో అనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాను నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చాడు. వేసవిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇన్నాళ్లు థియేట్రికల్ రిలీజ్ చేయాలా.. డిజిటల్ రిలీజ్ కి వెళ్లాలా అనే దానిపై డైలామాలో ఉన్న మేకర్స్.. చివరకు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపారు. సినిమా రైట్స్ సొంతం చేసుకున్న జీ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

జీ స్టూడియోస్ వారు సాయితేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని సుమారు 35 కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పుడున్న సగం థియేటర్స్ సగం ఆకుపెన్సీ వంటి షరతులతో సినిమాకి పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలంటే సంక్రాంతి సీజన్ వరకూ ఈ మూవీ థియేటర్స్ లో ఉండాల్సిన అవసరం ఉంది. థియేట్రికల్ రిలీజ్ కి ఎవరూ రాని టైమ్ లో ధైర్యంగా ముందుకొచ్చి సినిమాను థియేటర్ లో విడుదల చేస్తున్న మెగా మేనల్లుడి సినిమాకి తెలుగు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన తెచ్చుకుంటే మిగతా సినిమాలన్నీ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. మరి ‘సోలో బ్రతుకే..’ సినిమా లాంగ్ రన్ కి ఇండస్ట్రీ నుంచి మద్దతు లభిస్తుందేమో చూడాలి.

కాగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటించింది. థమన్ సంగీతం అందించాడు. వచ్చే నెల 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘చిత్రలహరి’ ‘ప్రతిరోజు పండగే’ వంటి విజయాల తర్వాత సాయి తేజ్ నటించిన ఈ సినిమా హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.