అప్పుడు గీతా ఆర్ట్స్ ఇప్పుడు త్రివిక్రమ్ బ్యానర్ పేరుతో కూడా మోసాలు

0

కొన్ని రోజుల క్రితం గీతా ఆర్ట్స్ తీయబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల్లో నటీనటులుగా ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొందరిని మోసం చేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన గీతా ఆర్ట్స్ వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అలాంటివి అస్సలు నమ్మవద్దంటూ పేర్కొంది. ఇలా సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడం కామన్ అయ్యింది. ఇటీవల సింగర్ సునీత మేనల్లుడిని అంటూ ఆమె పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది.

త్రివిక్రమ్ హోం బ్యానర్ గా పేరున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం వారి దృష్టికి రావడంతో వెంటనే జాగ్రత్తగా ఉండండి అంటూ నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది. మేము ఎలాంటి కాస్టింగ్ కాల్ ఇవ్వలేదు. మా కొత్త ప్రాజెక్ట్ ల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసినట్లుగా కొందరు ప్రచారం చేసి అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు కూడా మోసపోవద్దనే ఉద్దేశ్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.

మా పేరుతో ఎవరు నమ్మించేందుకు ప్రయత్నించినా కూడా నమ్మి మోసపోవద్దు. మా నుండి ఏదైనా ప్రకటన ఛానెల్స్ లేదా అఫిషియల్ అకౌంట్స్ నుండి వస్తే తప్ప నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది. కాస్టింగ్ కాల్ అంటూ ఈమద్య కొందరు ప్రముఖ కంపెనీల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. దాంతో ప్రతి ఒక్కరు కూడా వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.