వరదలో కొట్టుకెళ్లిన శర్వానంద్ తాత ఇల్లు

0

తీపి గురుతుల్ని కోల్పోతున్నారు టాలీవుడ్ హీరో శర్వానంద్. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో ఆయనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా చోటు చేసుకున్న కృష్ణానది వరద ప్రభావానికి ఆయన తాతగారి ఇల్లు కొట్టుకుపోయింది. క్రిష్ణా జిల్లా అవనిగడ్డలో శర్వానంద్ తాత కమ్ భారత మాజీ అణుశాస్త్రవేత్త డాక్టర్ మైనేని హరిప్రసాద్ నివాసం ఉంది.

అణుశాస్త్రవేత్తగా.. సంఘసేవకుడిగా పేరున్న ఆయన నివాసం తాజాగా వరదల్లోకొట్టుకుపోవటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహానికి కాస్త పక్కనే ఉన్న ఈ భవనం.. నీటి తాకిడికి సగానికి పైనే కొట్టుకెట్టినట్లుగా చెబుతున్నారు. గత ఏడాది సంభవించిన వరదల్లో శర్వానంద్ ముత్తాతకు చెందిన పెంకుటిల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకు పోయింది.

ఏడాదిలోనే ఈసారి తాతగారి ఇల్లు కొట్టుకుపోవటం గమనార్హం. హీరోగా పేరు తెచ్చుకున్న తర్వాత అవనిగడ్డ వచ్చిన సందర్భంగా శర్వానంద్ ఈ ఇంట్లోనే గడిపేవారని చెబుతున్నారు. వరద పోటుతో ఇల్లు కొట్టుకుపోవటంతో స్థానికులు ఆ ఇంటి వద్దకు చేరి.. తామేమీ చేయలేకపోతున్నామనే వేదనకు గురవుతున్నారు.