శర్వా ద్విభాషా చిత్రం షూటింగ్ పూర్తి..!

0

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. విలక్షణమైన పాత్రలు విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ‘శ్రీకారం’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన వర్సటైల్ యాక్టర్ శర్వా.. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఓ ద్విభాషా చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.

శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ బైలింగ్విల్ తో శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తెలుగమ్మాయి రీతూ వర్మ శర్వాకి జోడీగా నటిస్తోంది. ‘ఖైదీ’ ‘ఖాకీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎస్ ఆర్ ప్రభు.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ‘శర్వా30’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సుజీత్ సరంగ్.. ఎడిటర్ శ్రీజిత్ సరంగ్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. జాక్స్ బేజాయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో అక్కినేని అమల ఓ కీలక పాత్రలో కనిపించనుంది. వెన్నెల కిషోర్ – ప్రియదర్శి ఇతర పాత్రల్లో నటించారు.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాని త్వరలో థియేటర్స్ లో రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని కంప్లీట్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ముఖ్యంగా తల్లీ – కొడుకు మధ్య ఉండే అనుబంధం అన్ని వర్గాల వారిని అలరిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. శర్వా ఇంతకముందు ఎంజియుమ్ ఎప్పొధుమ్ (జర్నీ) – జేకే ఎనుమ్ నన్ బనిన్ – వాజ్ కాయ్ (రాజాధి రాజా) వంటి తమిళ చిత్రాలలో నటించి అక్కడ కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు తాజా సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.