చిరు బర్త్ డే కానుకగా మెగా డాటర్ ”షూట్-అవుట్ ఎట్ ఆలేరు” టీజర్…!

0

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్ డిజైనర్ గానే కాకుండా తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుష్మిత తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్ నిర్మించింది. ‘జీ 5 ఒరిజినల్’ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ప్రసారం కానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి ”షూట్-అవుట్ ఎట్ ఆలేరు” అనే టైటిల్ ఖరారు చేశారు.

కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా డాటర్ ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. మక్కా మసీదు పేలుళ్ల నేపథ్యాన్ని తీసుకొని కొంతమంది పోలీసులు – నేరస్తుల రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక 8 ఎపిసోడ్స్ తో కూడిన ఈ క్రైమ్ డ్రామాకి ‘ఓయ్’ డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ గురించి సుష్మితా కొణిదెల మాట్లాడుతూ.. ” నేను ప్రొడక్షన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ నా తొలి అడుగు. నాన్న బర్త్ డే నాడు మా వెబ్ సిరీస్ టీజర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులందరికీ ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. త్వరలో సిరీస్ విడుదల తేదీని ప్రకటిస్తాం” అని చెప్పుకొచ్చారు.