‘8 ఏళ్ళ తర్వాత నా తెలుగు సినిమా పనులు స్టార్ట్ కాబోతున్నాయి’

0

టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘Rx 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ”మహా సముద్రం” అనే మల్టీస్టారర్ బొమ్మరిల్లు సిద్ధార్థ్ నటిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో మరో హీరోగా వర్సటైల్ యాక్టర్ శర్వానంద్ నటించనున్నాడు. ఈ ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించనున్నారు. తాజాగా సిద్ధార్థ్ చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో నటిస్తున్నానంటూ పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ”8 సంవత్సరాల తరువాత నా మొదటి తెలుగు చిత్రం ‘మహాసముద్రం’ పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. నేను చెప్పినట్లుగానే తిరిగి వస్తున్నాను. నేను ఒక గ్రేట్ టీమ్ – గ్రేట్ కో యాక్టర్స్ తో వర్క్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మీ విషెస్ నాకు కావాలి” అని సిద్ధార్థ్ పేర్కొన్నాడు. దీనికి ‘మహా సముద్రం’ మేకర్స్ సిద్ధూకి స్వాగతం పలుకుతున్నట్లు ట్వీట్ చేసారు.

కాగా హీరో సిద్ధార్థ్ ‘నువ్వొస్తానంటే నేనోద్దంటున్నానా’ ‘బొమ్మరిల్లు’ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ‘ఓయ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. అయితే తెలుగులో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ సిద్ధార్థ్ టాలీవుడ్ కి దూరమయ్యాడు. చివరగా ‘బాద్ షా’ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన సిద్ధూ మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించలేదు. కాకపోతే ‘గృహం’ ‘వదలడు’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. ఈ క్రమంలో ఇప్పుడు దాదాపు 8 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా ‘మహా సముద్రం’లో నటిస్తున్నాడు సిద్ధూ. ఈ చిత్రాన్ని వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా తెలుగు తమిళంలో ఒకేసారి రూపొందిస్తారని సమాచారం. వచ్చే నెలలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. త్వరలోనే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.