నర్తనశాల’ నుంచి దివంగత శ్రీహరి ‘భీముడి’ లుక్…!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. బాలయ్య తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందించాలని సంకల్పించిన ‘నర్తనశాల’ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌదర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని అర్థాంతరంగా నిలిపివేశాడు. అయితే అప్పుడు చిత్రీకరించిన 17 నిమిషాల గల సన్నివేశాలను దసరా కానుకగా అక్టోబర్ 24న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు.

ఇప్పటికే ‘నర్తనశాల’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయబడింది. అర్జునుడిగా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఇందులో ‘భీముడు’గా కనిపిస్తున్న దివంగత శ్రీహరి లుక్ ని విడుదల చేశారు. భీముడి పాత్రలో రియల్ స్టార్ శ్రీహరిని చూసిన అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. శ్రీహరి లుక్ విడుదల సందర్భంగా శ్రీహరి తనయుడు మేఘాంశ్ స్పందించాడు. చాలా ఏళ్ళ తర్వాత తన తండ్రి నటించిన సినిమాను చూడబోతున్నందుకు ఆనందంగా ఉందని చెబుతూ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపాడు. శ్రీహరి – సౌందర్య ఇద్దరూ మరణించడంతో వారి పాత్రలను చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘నర్తనశాల’ 17 నిమిషాల సన్నివేశాలను ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు.