`అధీరా` మృత్యుంజయుడేనా.. క్యాన్సర్ ను జయించాడా?

0

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ స్టేజ్ 3 ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసినదే. దత్ కుటుంబం ఆ విషయాన్ని ఇంతకుముందు మీడియా ముఖంగా ప్రకటించింది. అనంతరం ఆయన విదేశాల్లో కుటుంబంతో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అటుపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్సను ప్రారంభించారు. సంజూ ఊహించని ప్రమాదంలో పడ్డారన్న వార్తలు నెల క్రితం వైరల్ కావడంతో అభిమానులు సినీ కొలీగ్స్ భారీ షాక్ కు గురయ్యాయి.

అయితే చికిత్స ఎంతవరకూ వచ్చింది? భాయ్ మృత్యుంజయుడు అయినట్టేనా? ఆయన సేఫ్ గా ఇంటికి తిరిగి వస్తున్నారా? అంటే అవుననే బాలీవుడ్ నుండి వస్తున్న తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సంజయ్ దత్ క్యాన్సర్ ను ఓడించారు. ఆయనకు ఇటీవల పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పిఇటి) స్కాన్ చేశారట. అతని శరీరంలో క్యాన్సర్ కణాలు లేవని ఫలితం వచ్చిందని తెలుస్తోంది. తదుపరి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ వార్త తో తీవ్ర ఆందోళన లో ఉన్న శ్రేయోభిలాషులందరికీ పెద్ద ఉపశమనం కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవలి వీడియో సందేశంలో సంజయ్ తన ఎడమ కనుబొమ్మ నుండి తల వెనుక వైపు వరకూ ఉన్న పొడవైన ఒక మచ్చను చూపించి ..“ఇది నా జీవితంలో ఇటీవలి మచ్చ… కానీ నేను దానిని జయిస్తాను. త్వరలో ఈ క్యాన్సర్ నుండి బయటపడతాను“ అంటూ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దత్ ఫ్యామిలీ దీనిపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ గుడ్ న్యూస్ తో కేజీఎఫ్2 టీమ్ ఫుల్ రిలాక్స్ అయిపోతుందనడంలో సందేహమేం లేదు.