సూపర్ ఫామ్ లో ఉన్న ఇద్దరు టాలీవుడ్ యువ హీరోలు…!

0

టాలీవుడ్ యువ హీరో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడనే విషయం తెలిసిందే. గతేడాది ‘మజిలీ’ ‘వెంకీమామ’ వంటి వరుస సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న చైతన్య.. ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా లాక్ డౌన్ టైంలో కొత్త కథలను వింటూ వచ్చిన చైతూ ‘థ్యాంక్యూ’ అనే మూవీని ప్రకటించాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారు. విజయదశమి సందర్భంగా ‘థ్యాంక్యూ’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ – నందిని రెడ్డి వంటి దర్శకులను చైతూ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

మరో వైపు టాలెంటెడ్ హీరో శర్వానంద్ కూడా వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘జాను’ సినిమాతో పలకరించిన శర్వానంద్.. ప్రస్తుతం ‘శ్రీకారం’ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. అలానే కొత్త దర్శకుడితో కలిసి తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ అనే చిత్రాన్ని ప్రకటించాడు శర్వా. మరో హీరో బొమ్మరిల్లు సిద్దార్థ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. దీంతో పాటు ఏసియన్ సోనాలి నారంగ్ సమర్పణలో ఓ సినిమా చేయనున్నాడు. తాజాగా ‘నేను శైలజ’ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు శర్వా. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ లో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది.

అయితే నాగచైతన్య – శర్వానంద్ ఇద్దరి మార్కెట్ ఆల్ మోస్ట్ ఇప్పుడు ఈక్వెల్ గానే ఉందని చెప్పవచ్చు. కాకపోతే ‘జాను’ సినిమాతో పరాజయం అందుకున్న శర్వా కంటే.. రెండు వరుస విజయాలతో చైతన్య ఒకడుగు ముందున్నాడని చెప్పవచ్చు. ఒకవేళ ఇప్పుడు చైతూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా సూపర్ హిట్ అయితే యువ హీరో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. శర్వా మాత్రం నాగచైతన్య ని దాటాలంటే ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ సినిమాలు మంచి విజయాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ ఇద్దరు యువ హీరోలు మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలను ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నారని చెప్పవచ్చు.