మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్న యూవీ క్రియేషన్స్…?

0

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన యూవీ క్రియేషన్స్ మంచి పేరు తెచ్చుకుంది. డార్లింగ్ ప్రభాస్ స్నేహితులైన ఉప్పలపాటి ప్రమోద్ మరియు వంశీ కృష్ణలు కలిసి ఈ ప్రొడక్షన్ హౌస్ ని నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా తీస్తున్నారు. ఇక ఇండస్ట్రీకి న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేయడంలో ఈ నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమాతో ప్రొడక్షన్ లోకి దిగిన యూవీ క్రియేషన్స్ కొరటాల శివ ని దర్శకుడుగా పరిచయం చేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సుజీత్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’ అనే సినిమాను నిర్మించారు. అదే క్రమంలో గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాతో రాధాకృష్ణ కుమార్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసారు. విజయ్ దేవరకొండ హీరోగా ‘టాక్సీవాలా’ సినిమాతో రాహుల్ ని డైరెక్టర్ గా పరిచయం చేసారు. ఇలా యంగ్ టాలెంట్ ని టాలీవుడ్ కి తీసుకొస్తున్న యూవీ క్రియేషన్స్ వారు మరో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం.

కాగా ”మనసానమః” అనే లఘు చిత్రం ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అందరి దృష్టినే కాదు మనసును కూడా ఆకట్టుకుంది. అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన ఈ షార్ట్ ఫిలింకి దీపక్ దర్శకత్వం వహించాడు. కాలాలకు అనుగుణంగా మారే పరిస్థితులని ఒక కుర్రాడు ప్రేమలో ఉన్నప్పుడు అనుభవించే భావోద్వేగాలకు ముడి పెడుతూ ఇప్పటితరం ప్రేమని.. ప్రేమకథలను చక్కగా తెరకిక్కించడంలో దర్శకుడు దీపక్ విజయం సాధించాడు. అందుకే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ ”మనసానమః”ను తమిళంలో డబ్ చేసి తన నిర్మాణ సంస్ధ ఒండ్రాగా ఎంటెర్టైన్మెంట్స్ ద్వారా విడుదల చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మెప్పు పొందిన దీపక్ ని ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సంస్థ టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయం చేయబోతోందట. ఆ షార్ట్ ఫిలిం చూసిన యూవీ వారు దీపక్ మీద నమ్మకంతో సినిమా చేయడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ తో నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ కంప్లీట్ అయిన తర్వాత దీపక్ తో ఓ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.