రానా ని ఫాలో అవుతున్న విశాల్..!

0

టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ నటులలో విశాల్ ఒకరు. ‘పందెంకోడి’ సినిమా నుంచి తమిళంలో తాను నటించే ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ‘పొగరు’ ‘పల్నాడు’ ‘వాడు వీడు’ ‘రాయుడు’ ‘పూజ’ ‘అభిమన్యుడు’ ‘డిటెక్టివ్’ ‘పందెంకోడి 2’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం విశాల్ ‘డిటెక్టివ్ 2’ ‘చక్ర’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక త్వరలోనే ‘అభిమన్యుడు 2’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించనున్నాడు. అయితే దీంతో పాటు విశాల్ మరో న్యూ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయబోతున్నాడట. ఈ విషయంలో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ని ఫాలో అవుతున్నాడని తెలుస్తోంది.

కాగా దగ్గుబాటి రానా తెలుగు తమిళ హిందీ భాషల్లో ‘అరణ్య’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు. ప్రభు సాలోమన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘అరణ్య’.. తమిళంలో ‘కాదన్’.. హిందీలో ‘హాథీ మేరే సాథీ’ పేరుతో విడుదల చేయనున్నారు. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో రానా అడవిలో నివసించే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపించనున్నాడు. మానవులు – జంతువుల మధ్య అనుబంధాలను ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ సినిమా రూపొందించారు. అయితే ఇప్పుడు విశాల్ కూడా తమిళ తెలుగు భాషల్లో ఇలాంటి ఫారెస్ట్ – జంతువుల నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడట. ఇందులో స్టార్ హీరోయిన్ త్రిషని ఎంపిక చేసుకున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.