Home / GADGETS / ఈ 10 విషయాలు తెలిస్తే.. Whatsappను వాడాలంటే కచ్చితంగా భయం వేస్తుంది!

ఈ 10 విషయాలు తెలిస్తే.. Whatsappను వాడాలంటే కచ్చితంగా భయం వేస్తుంది!

ప్రస్తుతం సోషల్ మీడియా రంగంలో వాట్సాప్ గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది. గతేడాది ఏకంగా 12 లోపాలు వెలుగులోకి రావడం, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఫోన్ వాట్సాప్ ద్వారా హ్యాక్ అయిందని ఆరోపణలు రావడంతో ప్రస్తుతం అందరూ వాట్సాప్ భద్రతను వేలెత్తి చూపిస్తున్నారు. తాజాగా టెలిగ్రాం వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ కూడా ఈ జాబితాలో చేరారు. వాట్సాప్ అత్యంత ప్రమాదకరమైన యాప్ అని ఆరోపించి దానికి కొన్ని కారణాలను కూడా తెలిపారు. ‘మాకు ప్రత్యర్థి కాబట్టి మేం ఈ ఆరోపణలు చేశామని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు. అదే నిజం కూడా అయి ఉండవచ్చు’ అన్నారు. టెలిగ్రాం సీక్రెట్ చాట్స్ వాట్సాప్ చాటింగ్ కంటే ఎన్నో రెట్లు సురక్షితమైందని ఆయన తెలిపారు. ఒకవేళ వాట్సాప్.. టెలిగ్రాం కంటే సెక్యూర్డ్ అయితే తాను టెలిగ్రాంను డెవలప్ చేసి ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించారు. వాట్సాప్ ప్రమాదకరమనడానికి దురోవ్ తెలిపిన కారణాలు ఇవే!

​1. ప్రపంచ కుబేరుడికే రక్షణ లేనప్పుడు ఇంకెవరికి ఉంటుంది?

వాట్సాప్ లో ఉన్న లోపాల ద్వారా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన జెఫ్ బెజోస్ సంబంధించిన ప్రైవేట్ చాటింగ్, అతని ఫొటోలే బయటకు వచ్చాయని ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తూ ఆయన వాట్సాప్ నే ఉపయోగిస్తున్నారు. ఈ దాడి జరిగింది విదేశీ ప్రభుత్వాల నుంచే అయినా.. ఇతర వ్యాపార వేత్తలు, ప్రభుత్వ అధినేతలు కూడా వీరికి లక్ష్యంగా ఉన్నారని దురోవ్ పేర్కొన్నారు.

​2. వాట్సాప్ ను డిలీట్ చేసేయండి: ఐక్యరాజ్యసమితి

ప్రపంచ శాంతి సంస్థ ఐక్యరాజ్యసమితి కూడా తన అధికారులను తమ ఫోన్ల నుంచి వాట్సాప్ ను డిలీట్ చేయాల్సిందిగా కోరిందని దురోవ్ అన్నారు. వాట్సాప్ అంత సురక్షితం కాదని ఐక్యరాజ్యసమితి భావించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు.

​3. ఫోన్లనే మార్చేస్తున్నారు!

ఐక్యరాజ్యసమితి ప్రతినిధి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు దగ్గరగా ఉండే వారిని కూడా వారి ఫోన్లు మార్చేయాల్సిందిగా సూచించారు. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ కూడా ఇప్పటికే తన ఫోన్ ను మార్చేశారు.

​4. క్షమాపణ చెప్పకుండా వేరేవారిపై నిందలా?

పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పకుండా ఫేస్ బుక్/వాట్సాప్ ఐవోఎస్ ను నిందిస్తున్నారని దురోవ్ అన్నారు. ఇకముందెప్పుడూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సింది పోయి పక్కవారిపై నిందలు వేయడంలో వారు బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ దాడి జరిగింది ఐవోఎస్ పై కాదని, వాట్సాప్ పై అని ఆయన ఆరోపించారు.

​5. ఎన్ క్రిప్షన్ ఉన్నా భద్రత లేదు!

తమ యాప్ గురించి మార్కెటింగ్ చేసుకునేటప్పుడు వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుందని, కానీ ఈ యాప్ ద్వారా జరిగే సంభాషణలకు అస్సలు భద్రత లేదని ఆయన అన్నారు. కాబట్టి వీలైనంత త్వరగా వాట్సాప్ ను అందరూ అన్ ఇన్ స్టాల్ చేయాలని సూచించారు.

​6. చాట్ బ్యాకప్స్ ఎన్ క్రిప్టెడ్ కాదు!

వినియోగదారులు తమ ఫోన్లు మార్చినప్పుడు చాటింగ్ ను కోల్పోకూడదు అనుకుంటారని, అందుకే వారు దాన్ని గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ లో భద్రపరుచుకుంటారని దురోవ్ తెలిపారు. కానీ వారి చాటింగ్ లకు ఎన్ క్రిప్షన్ ఉండదని ఆయన అన్నారు. యాపిల్ ఐక్లౌడ్ ను ఎన్ క్రిప్షన్ ప్లాన్లను నిలిపివేయాల్సిందిగా ఎఫ్ బీఐ ఒత్తిడి చేస్తుందని వివరించారు.

​7. లోపాలున్నాయి!

వాట్సాప్ లో కూడా లోపాలున్నాయి. న్యాయసంస్థలు ఈ ఎన్ క్రిప్షన్ తో సంతోషంగా లేవని, యాప్ డెవలపర్లను అందులో వల్నరబులిటీస్ ఉంచాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాయని దురోవ్ ఆరోపించారు. ఈ విషయంపై తమను కూడా వారు సంప్రదించారని, అందుకే తమకు ఈ విషయం తెలుసన్నారు. అయితే తాము దీనికి అంగీకరించలేదన్నారు. అందుకే తమపై కొన్ని దేశాల్లో నిషేధం విధించారని, వాట్సాప్ ఇలాంటి కాంప్రమైజ్ అయ్యింది కాబట్టే వారికి అలాంటి సమస్యలేవీ లేవని పేర్కొన్నారు.

​8. 2019లో 12 లోపాలు!

ఇటువంటి లోపాలను సాధారణంగా యాదృచ్ఛికంగా జరిగేవిగా పేర్కొంటారు. అలాంటిది గత సంవత్సరం ఏకంగా వాట్సాప్ లో 12 లోపాలు తలెత్తాయి. వాటిలో 7 లోపాలు అత్యంత తీవ్రమైనవి. జెఫ్ బెజోస్ ఫోన్ మీద జరిగిన దాడి కూడా అలాంటిదే. కానీ ఇప్పటికీ వాట్సాప్ తన యాప్ ను అత్యంత భద్రమైన యాప్ గా పేర్కొంటుందని, అందులో అస్సలు అర్థం లేదని దురోవ్ విరుచుకుపడ్డారు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ ఎలా అత్యంత భద్రమైన యాప్ అవుతుందని ప్రశ్నించారు.

​9. అసలు లోపం ఎన్ క్రిప్షన్ లోనే!

వాట్సాప్ ఎన్ క్రిప్షన్ అమలు చేయడంలోనే అసలు లోపం ఉందని దురోవ్ అన్నారు. వాట్సాప్ సోర్స్ కోడ్ ను కనిపెట్టడం, దాన్ని విశ్లేషించడం కూడా చాలా కష్టమని దురోవ్ తెలిపారు.

​10. ఆ ట్రాప్ లో పడకండి!

సర్కస్ మెజీషియన్లు చేసే మ్యాజిక్కుల మాయలో పడి మోసపోవద్దని ఆయన సూచించారు. మిమ్మల్ని వారి మాయలో పడేసి మోసం చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భద్రత అంటే కేవలం ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ మాత్రమే అని మాత్రమే మీరు ఆలోచించేలా వారు చేశారని ఆరోపించారు. వారు చెప్పిన దానికి జరిగే దానికి అస్సలు పోలిక లేదన్నారు.

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top