Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> మధుమేహం రోగులు అల్పాహారం మానేస్తే ఏమవుతుంది?

మధుమేహం రోగులు అల్పాహారం మానేస్తే ఏమవుతుంది?


మీకు మధుమేహం (డయబెటీస్) ఉందా? ఉదయం వేళల్లో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) మానేయడం వల్ల సుగర్ తగ్గుతాయని భావిస్తున్నారా? అయితే, పప్పులే కాలేసినట్లే. మధుమేహం రోగులు అల్పాహారం మానేయడం వల్ల సుగర్ లెవెల్స్ తగ్గకపోగా, మరింత ఎక్కువవుతాయని ఓ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహ రోగుల్లోనే ఈ సమస్య ఎక్కువని తెలిసింది.

అల్పాహారం (టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్) తినకుండా నేరుగా లంచ్, డిన్నర్ చేయడం వల్ల మధుమేహం రోగుల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయనే అంశంపై 22 మంది టైప్-2 మధుమేహం రోగులపై పరిశోధనలు జరిపారు. వీరికి ఒక రోజు అల్పాహారం పెట్టకుండా కేవలం లంచ్, డిన్నర్ మాత్రమే పెట్టారు. రెండో రోజు అల్పాహారం, లంచ్, డిన్నర్ పెట్టారు. ఆ రెండు రోజులు వారి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ను పరీక్షించి, వ్యత్యాసాలను పరిశీలించిన వైద్య నిపుణులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

అల్పాహారం తినని రోజు బ్లడ్ గ్లూకోజ్ లెవల్ పెరిగినట్లు గుర్తించారు. లంచ్ తర్వాత జరిపిన పరీక్షలో 36.8 శాతం, డిన్నర్ తర్వాత జరిపిన పరీక్షలో 26.6 శాతం బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెరిగాయి. దీంతో, ఉదయం వేళల్లో అల్పాహారం తినకపోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రించడం కష్టమని తేల్చేశారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఉదయం వేళల్లో అత్యధికంగా సుమారు 700 కెలోరీల అల్పాహారం తీసుకునేవారిలో ఆ రోజంతా బ్లడ్ సుగర్ లెవల్స్ తగ్గినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంచి అల్పాహారం ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రివచ్చవచ్చని పరిశోధకులు తెలుపుతున్నారు. కాబట్టి.. మీకు కూడా మధుమేహం ఉన్నట్లయితే.. ఉదయం వేళల్లో తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోండి.