మొటిమల కలగటానికి గల కారణాలు మరియు చికిత్సలు

0

నూనె పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్లనే మొటిమలు వస్తాయన్నది వాస్తవం కాదు. యవ్వనంలోకి అడుగు పెడుతున్న వారిలోనే మొటిమల సమస్య ఉంటుందనేది కూడా నిజం కాదు. నలభై ఏళ్లు పైబడిన వారు కూడా మొటిమలతో ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మొటిమలు అంటే కేవలం ముఖంపైనే కాదు. చేతులు, ఛాతి, వీపు భాగాల్లోనూ ఉంటాయి. మొటిమలు వచ్చిన వారిలో కొందరికి తొందరగానే తగ్గిపోతాయి. కొందరికి మచ్చలు ఏర్పడుతాయి. మరికొందరిలో మొటిమలు ఉన్నచోట గుంటలు ఏర్పడతాయి.

కారణాలు
హార్మోన్’లలో మార్పులు, చర్మంలో నూనె గ్రంథుల పనితీరు, గర్భనిరోధక మాత్రల ప్రభావం, క్షయ వ్యాధికి వాడే మందులు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వంటివి మొటిమలు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు మొటిమలు వస్తుంటాయి. అంతేకాదు మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆడవాళ్లలో పీసీఓడీ వున్నప్పుడు, వంశపారంపర్యత, జిడ్డు చర్మం మొటిమలు ఏర్పడటానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

మొటిమల వలన సమస్యలు
మొటిమలు అనేవి స్వేద గ్రంథులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖంతో పాటు మెడ, భుజము, ఛాతిపైన కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎనభై శాతం యువతీ యువకులు మొటిమల బాధ ఎదుర్కొంటున్న సర్వేలు వెల్లడిస్తున్నాయి. యవ్వనంలో హార్మోనుల సమతుల్యం లోపించడం వల్ల సబేసియస్ గ్రంథుల నుండి సెబమ్ ఎక్కువగా విడుదలై మొటిమలు ఏర్పడతాయి. మొటిమల్లో చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుంటాయి. మొదటి రకానికి చెందిన మొటిమలు యుక్త వయసులో కొన్నిరోజులు ఉండి, వాటికవే తగ్గిపోతాయి. వాటితో ఎటువంటి సమస్యలు ఉండవు. అంతేకాదు చిన్న రకం మొటిమల వల్ల ఏ విధమైన మచ్చలు కూడా ఏర్పడవు. అయితే, పెద్ద రకం మొటిమలతోనే అసలు సమస్య. వాటివల్ల నొప్పి, దురద వంటి బాధలను భరించాల్సి ఉంటుంది. ఈ రకం మొటిమలు దాదాపు ఇవి ముఖం పైనే ఏర్పడుతాయి. ముఖంపై ఉండే నూనె గ్రంథులు చర్మంలోని వెంట్రుకల మొదల్లలో జిడ్డును తయారు చేస్తాయి. వెంట్రుక కుదుళ్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల, బయటి సూక్ష్మ జీవుల వల్ల, ఇన్ఫెక్షన్‌కి గురై పుండుగా మారి, ఆ పుండు మానిపోయి అక్కడ ఓ మచ్చగా మిగులుతుంది. చిదపడం, గోకడం వలన గోళ్ల నుండి ఇన్ఫెక్షన్ అయి ఎక్కువగా బాధపెడుతుంది.

నివారణ చర్యలు
ఆరోగ్యంగా ఉండటమ వలన కూడా మొటిమలకు దూరంగా ఉండవచ్చు. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ముఖాన్ని మూడు పూటలా సబ్బుతో కడుక్కోవాలి. జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటే మాత్రం నూనె, కొవ్వు పదార్థాలు తినడం తగ్గించాలి. మొటిమలను గిల్లడం, గోకడం వంటివి చేయకూడదు. మానసిక ఆందోళనలను తగ్గించుకోవడానికి ప్రాణయామం, యోగా చేస్తే మంచిది. ఆకు కూరలు, పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు. స్వీట్స్, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి. జీర్ణశక్తి సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇవే కాక, సున్నిపిండితో ముఖం కడుక్కోవడం, క్రీముల వాడకం తగ్గించడం, సరైన నిద్ర ఉండేలా చూసుకోవడం వంటి ఆరోగ్య నియమాలు పాటిస్తే కొంత వరకు శరీరంపై మొటిమల ప్రభావాన్ని తగ్గించవచ్చు.

చికిత్సలు
శరీరంలోని హార్మోన్’ల అసమతుల్యత సుమారు ఒక సంవత్సరానికి సర్దుకునే అవకాశం ఉంది. ఆ తరువాత మొటిమలు వాటంతటమే పోతాయి. మళ్లీ పుట్టవు. అయితే సంవత్సర కాలం మొటిమల్ని భరించే కన్నా అందుబాటులో ఉన్న వైద్యాన్ని సంప్రదిస్తున్నారు చాలామంది. మొటిమలు తొందరగా నయం చేయడానికి కొన్ని రకాల పిల్స్, లేజర్లు అందుబాటులో ఉన్నాయి. మొటిమల తీవ్రటతను బట్టి లేజర్ చికిత్స కూడా ఉంటుంది.

మొటిమల వల్ల ముఖంపై ఏర్పడిన గుంటలను తగ్గించడానికి లేజర్, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఫ్రాక్షనల్ సీబో2, అర్బియంగ్లాస్, ఎన్డీయాగ్, ఐపీఎల్ వంటి లేజర్ చికిత్సలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ రెండు విధానాలు వద్దనుకున్నవారికి ‘ఫిల్లర్స్’ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది.