Templates by BIGtheme NET
Home >> REVIEWS >> ఏమో గుర్రం ఎగరావచ్చు రివ్యూ

ఏమో గుర్రం ఎగరావచ్చు రివ్యూ


ఏమో గుర్రం ఎగరావచ్చు – కాస్ట్ అండ్ క్రూ: Sumanth , Pinky Sawika Chaiyadech…

సినిమా తీయాలంటే అద్భుత‌మైన క‌థ అవ‌స‌రం లేద‌ని మ‌నవాళ్లు గ‌ట్టిగా తీర్మాణించేసుకొన్నారు. అందుకే ఆ దిశ‌గా ఆలోచించ‌డం లేదు. క‌నీసం బ‌ల‌మైన లైన్ అయినా ఉండాలి. దాని చుట్టూ కాస్త వినోదం, మంచి పాట‌లు, ఇంకొంత ఫీల్ అందింస్తే స‌రిపోతుంది… ఇదీ ఇప్పటి సూత్రం. ఈ లైన్‌ కి కూడా ప‌ట్టించుకోకుండా గాల్లో మేడ‌లు క‌ట్టిన‌ట్టు.. స‌న్నివేశాలు తీసుకొంటూ పోయి – అర్థం ప‌ర్థం లేని కామెడీ పేరుతో వెకిలి వేషాలేసి, తెర‌పై 50మంది న‌టీన‌టులంటే అంద‌రూ ఓవ‌రాక్షన్ చేసి విసిగిస్తే… దానికి పెట్టిన అంద‌మైన పేరు – ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు.

ఓ సినిమా మొద‌లెట్టాలంటే క‌థ టైమ్ట్ చేయాలి. లేదంటే లైన్ అయినా బాగుండాలి. ’ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు’ సినిమా చూస్తే మాత్రం.. మ‌న‌సులో ఏం అనుకొని ఈ సినిమా మొద‌లెట్టారా?? అన్న అనుమానం వేస్తుంది. అస‌లు ద‌ర్శకుడు, క‌థ‌కుడు నిర్మాత‌ని ఒప్పించారు చూడండి… అక్కడ వారిద్దరికీ వీర‌తాళ్లు వేయొచ్చు. క‌థ లేక‌పోయినా ఏమో హిట్ కొట్టేయొచ్చు అనుకొనో, లేదంటే ఇన్ కమ్ టాక్స్ వారికి న‌ష్టాలు చూపించ‌డానికో ఈ సినిమా తీసుకొని ఉంటే.. మ‌నం ఏం చేయ‌లేం. ఇక క‌థ‌లోకి ఎంట‌రైపోదాం.

అదో ప‌ల్లెటూరు. బుల్లెబ్బాయ్ (సుమంత్‌) అక్కడ బాగా ఫేమ‌స్‌. ఎందులో అంటే ప‌దో ప‌ర‌గ‌తి ప‌ద్నాలుగు సార్లు త‌ప్పినందుకు. అమెరికాకు వెళ్లాల‌న్న ధ్యేయం మాత్రం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక‌డిని చిత‌గ్గొట్టడానికి. మ‌ర‌ద‌లు నీల‌వేణి (పింకీ సావిక‌) అమెరికా నుంచి వ‌స్తుంది. ఆమెకు పెళ్లిసంబంధాలు చూస్తుంటారు. కానీ దేన్నీ ఒప్పుకోదు. చివ‌రికి బుల్లెబ్బాయిని చేసుకొంటానంటుంది. ఇంట్లో వాళ్లు కూడా ఓకే అంటారు. కానీ బుల్లెబ్బాయికి ఓ అనుమానం. ఇంత‌మంది ఉండ‌గా.. ప‌దోత‌ర‌గ‌తి కూడా పాస‌వ్వని న‌న్నెందుకు ఇష్టప‌డిందీ.. అని. నేన‌క్కడ ఓ అబ్బాయిని ఇష్టప‌డ్డా. నిన్ను పెళ్లిచేసుకొని అక్కడికి తీసుకెళ్లిపోతా… విడాకులిచ్చి మ‌ళ్లీ నేను కోరుకొన్నవాడిని పెళ్లి చేసుకొంటా అంటుంది. దానికి బుల్లెబ్బాయి ఇచ్చిన స‌మాధానం ఏమిటి? ఇద్దరికీ పెళ్లి జ‌రిగిందా? బుల్లెబ్బాయి అమెరికా వెళ్లాడా?? అన్నదే ఈ గుర్రం క‌థ‌.

న‌మ‌స్తే లండ‌న్ సినిమా నుంచి ఎత్తేసిన పాయింట్ ఇది. మ‌న వాతావ‌ర‌ణాన్ని మిక్స్ చేసి, తెలుగు సినిమానే అని భ్రమించ‌డానికి ద‌ర్శకుడు, క‌థ‌కుడు ప‌డ‌రాని పాట్లూ ప‌డ్డారు. ఈమాత్రం లైన్ కోసం ప‌క్క సినిమాల్ని కాపీ కొట్టేయాలేంటి? మ‌న ’జై చిరంజీవ’ కూడా ఇంచుమించుగా ఇలాంట‌గి సబ్జెక్టే! వెదికి చూడాలే గానీ బోలెడ‌న్ని త‌ప్పులు క‌నిపిస్తాయి ఇందులో. నీల‌వేణి బుల్లెబ్బాయిని పెళ్లి చేసుకోవ‌డానికీ, బుల్లెబ్బాయి అమెరికా వెళ్లాల‌ని క‌ల‌లు క‌న‌డానికి పెద్దగా రీజ‌న్స్ ఉండ‌వు. ఒక‌వేళ ఇంట్లోవాళ్ల కోసం బుల్లెబ్బాయిని పెళ్లిచేసుకొంద‌నే అనుకొందాం. అదే ఇంట్లోవాళ్లని కాద‌ని అమెరికాలో ఇంకొక‌డిని ఎలా క‌ట్టుకొంటుంది?? ఇంత చిన్న పాయింట్‌ ని ద‌ర్శకుడు ఎందుకు మిస్ అయ్యాడు. ఒక‌డిని కొట్టడానికి బుల్లెబ్బాయి అమెరికా వెళ్తాడా? త‌న‌ని బ‌క‌రాని చేసి ఆడుకోవ‌డానికే పెళ్లి చేసుకొంటుంద‌ని తెలిసి కూడా బుల్లెబ్బాయి ఎందుకు స‌రెండ‌ర్ అయిపోతాడు.. నాన్సెన్స్‌. ప‌తాక స‌న్నివేశాలు మ‌రీ వ‌ర‌స్ట్‌. క‌థానాయిక‌లో మార్పు రావ‌డానికి బ‌ల‌మైన పాయింటేం లేదు. సినిమా మొద‌లెట్టాం క‌దా, ముగించ‌క‌పోతే సీరియ‌ల్ అయిపోతుంద‌నుకొని శుభం కార్డు వేయ‌డానికి.. అలా కానిచ్చేశారు.

సుమంత్‌ కి ఏమాత్రం స‌రిపోని క్యారెక్ట‌రైజేష‌న్ ఇది. సుమంత్ బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివ‌రీ, యాస వెంట‌కారంగా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం వికారంగా ఉన్నాయి. ర‌వితేజ‌నో, సునీల్‌ నో ఊహించేసుకొని యాక్ట్ చేయ‌డానికి తెగ క‌ష్టప‌డ్డాడు.. ప్రేక్షకుల్ని క‌ష్టపెట్టాడు. మ‌ధ్యలో లేడీ గెట‌ప్ ఒక‌టి. ఆ పాట‌లో సుమంత్ చేసిన డాన్సులు.. మ‌రింత వెగ‌టు పుట్టిస్తాయి. పింకీ మ‌రో రాంగ్ ఛాయిస్‌. ఆమెలో ఇటు తెలుగుద‌నం, అటు అమెరికాద‌నం రెండూ లేవు. లిప్ సింగ్ ఏమాత్రం కుద‌ర‌లేదు. ఎక్స్ ప్రెష‌న్స్ మ‌రీ వీక్‌. మిగిలిన పాత్రధారులంతా దాదాపుగా కొత్తవారే. ద‌ర్శకుడు త‌న‌కు తెలిసిన మేళాన్నంతా ఈ సినిమాలో న‌టీన‌టులుగా మార్చేసిన‌ట్టున్నాడు. వారి గురించి చెప్పుకోవ‌డం శుద్ధ వేస్ట్‌. తాగుబోతు ర‌మేష్‌.. ఈ సినిమాలో మాత్రం తాగ‌లేదు. అదే రిలీఫ్‌.

కీర‌వాణి త‌న ఆర్‌.ఆర్‌ తో లేని ఎమోష‌న్‌ ని తీసుకురావ‌డానికి శ‌త‌విధాలా ప్రయ‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఇంత బ‌ల‌హీన‌మైన క‌థ‌కు రెహ‌మాన్‌, ఇళ‌య‌రాజాలు క‌ల‌సివ‌చ్చినా ఏం చేయ‌లేరు. ఫొటోగ్రఫీ మాత్రం బాగుంది. నీట్‌ గా ప్రజెంట్ చేశారు. కానీ అమెరికా అని చెప్పి.. బ్యాంకాక్‌ లో స‌న్నివేశాలు తీసేయండం ఏం బాలేదు. కాంచి రాసిన సంభాష‌ణ‌లు ఏమాత్రం న‌వ్వించ‌లేక‌పోయాయి. దానికి తోడు ఆయ‌న కూడా ఓ క్యారెక్టర్ వేసేశాడు. అది మ‌రింత రోత పుట్టించింది. ఆయ‌న ఓవ‌రాక్షన్ అస్సలు చూళ్లేం.

ఎన్నాళ్ల నుంచో సుమంత్ ఓ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఫ్లాప్ సినిమా చేయ‌డం కంటే ఖాళీగా ఉండ‌డ‌మే బెట‌ర్‌.. అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పిన సుమంత్‌.. ఈ సినిమా కూడా చేయ‌కుండా ఉండాల్సింది. బ్యాడ్ ల‌క్‌…

 

Emo Gurram Egaravachu Review