Templates by BIGtheme NET
Home >> REVIEWS >> లవ్ యు బంగారమ్ రివ్యూ

లవ్ యు బంగారమ్ రివ్యూ


చిత్రం : లవ్ యు బంగారమ్

లవ్ యు బంగారమ్ కాస్ట్ అండ్ క్రూ: Rahul, Sravya, Govi, Vallabh, Mahith Narayan

కాలేజీ క‌థనో, టీనేజీ అల్లర‌నో బూతు చూపిస్తే ఓ అర్థం ఉంది. పోనీలెండి… ఈత‌రం కుర్రకారు అలానే ఉన్నార‌నుకోవ‌చ్చు. భార్యాభ‌ర్తల శృంగారాన్ని కూడా ప‌చ్చిగా చూపిస్తే ఏమ‌నాలి?? మారుతిపై ఓ ముద్ర ప‌డిపోయింది. ఇలాంటి ప‌చ్చి బూతు సినిమాలే తీస్తాడ‌ని. ఈరోజుల్లో, బ‌స్ స్టాప్ సినిమాలే అందుకు ఉదాహ‌ర‌ణ‌. నిర్మాత‌గా తీస్తున్న చిత్రాల్లోనూ బూతు కంటెంట్ ఉండేలా జాగ్రత్త ప‌డుతుంటాడు. నిన్నటి రొమాన్స్‌, ఇప్పటి ’ల‌వ్‌యూ బంగారం’. ఈ సినిమాతో గోవి అనే ఓ కొత్త ద‌ర్శకుడు మెగాఫోన్ ప‌ట్టాడు. ప‌ట్టాడ‌న్నమాటే గానీ మారుతి అడుగుజాడ‌ల్లో ఈ సినిమాని తీసేసి జ‌నం మీద‌కు వ‌దిలాడు. ’ల‌వ్ యూ బంగారం’లో ఉన్న మితిమీరిన శృంగారం గోలేంటో చూసేద్దాం రండి.

ఆకాష్ (రాహుల్ ) ఆత్మనూన్యతాభావంతో బాధ‌ప‌డుతుంటాడు. చిన్నదానికి ఫ‌స్ట్రేష‌న్‌ కి గుర‌వుతుంటాడు. అసిస్టెంట్ మేనేజ‌ర్ ఉద్యోగం చేస్తున్నాడ‌న్నమాటేగానీ, బండి కూడా కొనుక్కోలేడు. అదంతా మ‌రో క‌థ‌లెండి. ఇక మీనాక్షి (శ్రావ్య‌) ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకొంటారు. పెద్దల‌కు ఇష్టం లేక‌పోయినా పెళ్లి చేసుకొంటారు. విశాఖప‌ట్నం నుంచి హైద‌రాబాద్ వ‌చ్చి సెటిలైపోతారు. కొంత‌కాలం వారి కాపురం స‌వ్యంగానే సాగుతుంది. మీనాక్షికి ఇంట్లో బోర్ కొట్టి ఉద్యోగం చేయాల‌నుకొంటుంది. దానికీ ఆకాష్ ఓకే అంటాడు. కానీ మ‌న‌సులో ఎన్నో అనుమానాలు. దానికి త‌గ్గట్టు ఆ ఆఫీసులోని మ‌నుషులంతా ర‌క‌ర‌కాలుగా ఉంటారు. ఈలోగా మీనాక్షి ప‌దోత‌ర‌గ‌తిలో ప్రేమించిన మ‌ద‌న్ (రాజీవ్‌) కూడా దిగిపోతాడు. ఉద్యోగంలో చేరిన త‌ర‌వాత మీనాక్షిలోని మార్పు గ‌మ‌నిస్తాడు ఆకాష్‌. వెనుక ఏదో జ‌రుగుతోంద‌నే అనుమానం రోజు రోజుకీ బ‌ల‌ప‌డుతుంది. అస‌లు మీనాక్షిలో వ‌చ్చిన మార్పుకి కార‌ణ‌మేంటి?? ఇవ‌న్నీ అనుమానాలేనా? లేదంటే నిజంగానే మీనాక్షి ప‌క్కదోవ ప‌ట్టిందా? అన్నదే ’ల‌వ్ యూ బంగారం’ లోని క‌థ‌.

ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది భార్యాభ‌ర్తల క‌థ‌. దాన్ని బాగా రొమాంటిక్‌ గా చెప్పాడు. అయితే ఇందులోనే చిన్న ట్విస్టు ఉంది. ఓ సైకో పాత్ర‌. అది క్లైమాక్స్‌లో ప్రవేశిస్తుంది. నిజానికి ఆ సైకో కోసం ఓ క‌థ రాసుకొని దానికో ’ల‌వ్ స్టోరీ’ని యాడ్ చేసుకొన్నాడ‌నిపిస్తుంది గోని. ప్రీ క్లైమాక్స్ వ‌ర‌కూ సినిమా మెయిన్ లైన్‌లోకి రాదు. వ‌చ్చిన త‌ర‌వాత ఆ సైకోనీ, అత‌గాడి అరాచ‌కాల్ని చూడ‌లేం. పెళ్లికి ముందు ఎపిసోడ్ అయితే శుద్ధ దండ‌గ‌. ఆ ప్రేమ వ్యవ‌హారాలు కొత్తగా ఉన్నాయా అంటే అదీ.. బీసీ కాలంనాటి ఎత్తుగ‌డ‌లే. అబ్బాయి మంచిత‌నాన్ని చూసి అమ్మాయి ల‌వ్‌ లో ప‌డిపోవ‌డం, అమ్మాయి అందాన్ని చూసి అబ్బాయి వెంట ప‌డ‌డం – ఇలా సాగుతుంది ఆ ప్రసహ‌నం.

ఈ క‌థ‌లో ఉప‌క‌థ‌లు, పిట్ట క‌థ‌లూ బోలెడ‌న్ని ఉన్నాయి. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులపై ద‌ర్శకుడికి కోపం, ప‌గ‌, ప్రతీకారం వ‌గైరా వ‌గైరాలు బాగా ఉన్నట్టున్నాయి. అవ‌న్నీ ఈ సినిమాలో చూపించేశాడు. సాఫ్ట్‌ వేర్ ఉద్యోగులంటే ఆఫీసులో బీఎఫ్‌ లు చూస్తూ, బీర్లు తాగే ర‌కంలా చిత్రీక‌రించాడు. జేబులో పెన్ను పెట్టుకొన్నట్టు కండోమ్ పేకెట్లు పెట్టుకొంటార‌న్నట్టు చూపించాడు. డ‌బుల్ మీనింగ్ డైలాగుల గురించైతే ఇక చెప్పకండి.

నేను సీల్డు ఓపెన్ చేయ‌డంలో స్పెష‌లిస్టుని అంటాడో ఓ మ‌గాడు… అమ్మాయి వంక చూస్తూ! లావు, స‌న్నం మేట‌ర్ కాదు, వ‌ర్క్ చేయ‌డం కావాలి.. అంటుందో అమ్మాయి.. తొమ్మిదైనా బెడ్‌ రూమ్‌ లోనే ఉంచేస్తే నీకు వంట ఎలా చేయాలి.. అని అడుగుతుంది ఓ ఇల్లాలు..! ఇవి మ‌చ్చుక్కి మాత్రమే. ఏరుకొంటే థియేట‌ర్ నిండా ఇవే.

ఇక న‌టీన‌టుల ప్రతిభ‌..? ఏం చెప్పాలి? ఎవ‌రి గురించి చెప్పాలి. ఈ సినిమాలో హీరోకి న‌ట‌న రాదు. అన్ని డైలాగుల‌కీ ఒక‌టే ఎక్స్‌ ప్రెష‌న్‌. రాహుల్‌ కి ఇంత‌కు ముందు అబ్బిన ఆ కాస్త న‌ట‌న కూడా వ‌దిలేసిన‌ట్టున్నాడు. హీరోయిన్ అందంగా లేదు. ఆమెని ఏ యాంగిల్లో చూసినా ఇకారంగా ఉంటుంది. మెహం అస‌లే చూడ‌లేం. ఆ విష‌యం కెమెరా మెన్‌ కి కూడా తెలిసిపోయి బొడ్డుని చూపించ‌డంపైనే కాన్సట్రేష‌న్ చేశాడ‌నిపిస్తుంది. అందంగా ఉన్నవాళ్లు ఎక్స్‌పోజింగ్ చేస్తే అదో అందం. ఇకారంగా ఉన్నవాళ్లూ చేసేస్తే… థియేట‌ర్లోంచి పారిపోవాల‌నిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల ప‌రిస్థితీ అంతే. జెబి. ఆర్ ఆర్ బాగుంది. పాట‌లు బాగున్నా… అందులోనూ హీరో హీరోయిన్లు వీళ్లే కాబ‌ట్టి అస్సలు చూళ్లేక‌పోయాం. ఫొటోగ్రఫి మాత్రం నీట్‌ గా ఉంది. చిన్న సినిమా అన్న పీలింగ్ ఎక్కడా రాలేదు.

మొత్తమ్మీద ఈ సినిమాలోనూ మారుతి త‌న పైత్యం చూపించాడు. బూతుని న‌మ్ముకొని జ‌నాన్ని థియేట‌ర్లకు ర‌ప్పిద్దామ‌నుకొన్నాడు. డ‌బుల్ మీనింగ్‌ లు లేకుండా సినిమాని డైరెక్ట్ చేయ‌లేని మారుతి, ఇప్పుడు అది లేకుండా సినిమాకి పెట్టుబ‌డి పెట్టలేని స్థితికి దిగ‌జారాడు. ఏదో జ‌రుగుతుంది అని తెలుసుకోవాల‌న్న ఆస‌క్తి, ఏం జ‌రుగుతుందో అన్న ఆత్రుత ఇవి రెండూ ప్రేక్షకుల‌కు క‌ల్పించ‌లేక‌పోయే సినిమాలు శుద్ధ అన‌వ‌స‌రం. ఆ కోవ‌లోకే ఈ సినిమా చేరుతుంది.

 

 Love You Bangaram Review in English

Tags : లవ్ యు బంగారమ్ రివ్యూ, లవ్ యు బంగారమ్ రివ్యూ, రివ్యూ లవ్ యు బంగారమ్, రివ్యూ : లవ్ యు బంగారమ్, Love You Bangaram (Love u Bangaram) Review,Love You Bangaram Rating,Love You Bangaram Movie Review,Love You Bangaram Movie Rating,Love u Bangaram Telugu Movie Review,Rahul,Sravya,Govi,Vallabh,Mahith Narayan, Love You Bangaram Live updates, Love You Bangaram Hit or Flop, Love You Bangaram Talk, love you bangaram telugu review