Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఆ జాబితా నుంచి అదానీ పేరు ఔట్..!

ఆ జాబితా నుంచి అదానీ పేరు ఔట్..!


న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఇటీవల అదానీ గ్రూప్స్ కు సంబంధించిన అవకతవకలపై నివేదిక విడుదల చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల ఆస్తులన్నీ పేక మేడలని వెల్లడించడంతో వాటికి సంబంధించిన షేర్స్ మొత్తం పతనం అవుతున్నాయి. దీంతో ఆసియాలో అపార కుబేరుడిగా ఉన్న అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల టాప్ టెన్ జాబితాలో తాజాగా స్థానం కోల్పోవాల్సి వచ్చింది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ప్రకారంగా 2023 జనవరి 31 నాటికి గౌతమ్ అదానీ సంపద విలువ 84.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్ట్ 189 బిలియన్ డాలర్లతో కొనసాగుతున్నారు. ఆ తర్వాత ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ రెండో స్థానం ఉండగా.. మూడో స్థానంలో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు.

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత నుంచి అదానీ కంపెనీ షేర్స్ భారీగా పతనం అవుతూ వస్తున్నాయి. అదానీ స్టాక్స్లో బుధవారం భారీ నష్టాలను చవిచూశాయి. అప్పటి దాకా ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉండే గౌతమ్ అదానీ శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే నాటికి ఏడు ఎనిమిదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

మరోవైపు గత 24 గంటల్లో అదానీ సంపద 8.21 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 36.1 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ అదానీ ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో టాప్-10 నుంచి బయటికొచ్చాడు. ప్రస్తుతం ఆయన 11 స్థానంలో కొనసాగుతున్నారు. కాగా మంగళవారం అదానీ గ్రూప్ స్టాక్స్ లోయర్ లిమిట్ను టచ్ చేశాయి.

అదానీ టోటల్ గ్యాస్ పది శాతం పతనంతో లోయస్ సర్క్యూట్ను తాకగా.. అదానీ ఎంటర్ప్రైజెస్ రెండు శాతానికి పడిపోయింది. అదానీ గ్రూప్నకు చెందిన పది కంపెనీల విలువ 75 బిలియన్ డాలర్ల మేర పతనమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

దీనంతటికీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికే కారణమని భావిస్తున్న అదానీ గ్రూప్ ఆ సంస్థపై ఎదురుదాడికి దిగింది. దీంతో ఇరువర్గాల మధ్య వాడివేడి మాటల యుద్ధం నడుస్తోంది.