Taraka Ratna Health Update : నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందనే విషయం వాస్తవమే. అయితే, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అది పక్కన పెడితే… తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిందనేది మరో కథనం. దీనిపై గతంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తాజాగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపిన వివరాలు, మాట్లాడిన మాటలు వింటే ఆ విధంగా అనిపించక మానదు.
దగ్గరుండి చూసుకుంటున్న బాలకృష్ణ
కుప్పంలో తారక రత్న కుప్పకూలిన సమయం నుంచి బెంగళూరు వెళ్ళే వరకు… ఇప్పుడు ఈ క్షణం వరకు కన్న కుమారుడి కంటే ఎక్కువగా, కంటికి రెప్పలా నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) చూసుకుంటున్నారు. వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు అప్ టు డేట్… అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. కుప్పంలో బాలకృష్ణ దగ్గర ఉండి తారక రత్నను చూసుకున్న విషయాన్ని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.
”బాలయ్య గారు వచ్చిన తర్వాతే తారక రత్నకు రికవరీ అయ్యింది. ఇదొక మిరాకిల్ ఆ, ఏదో… నాకు అయితే అర్థం కావడం లేదు. అక్కడ నేను ఉన్నాను. ఆల్మోస్ట్ డాక్టర్లు అయ్యిపోయిందని చెప్పిన సమయంలో బాలయ్య గారు వచ్చారు. అప్పటికి అప్పుడు రికవరీ కావడం మిరాకిల్” అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. తాజాగా తుమ్మల ప్రసన్న కుమార్ సైతం అదే విధంగా మాట్లాడారు. హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు.
రోజు రోజుకీ ఆరోగ్య పరిస్థితి బావుంటోంది
రోజు రోజుకీ తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, వైద్య చికిత్సకు ఆయన స్పందించడంతో పాటు కోలుకుంటున్నారని తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. ఒక దశలో తారక రత్న గుండె ఆగిందనుకున్న సమయంలో బాలకృష్ణ పిలుపునకు స్పందించారని, అప్పుడు బాలకృష్ణ మృత్యుంజయ మంత్రం చదవడంతో మళ్ళీ పల్స్ స్టార్ట్ అయ్యిందని, అదొక మెడికల్ మిరాకిల్ అని ప్రసన్న కుమార్ చెప్పారు. ఈ రోజు తారక రత్న జీవించి ఉన్నారంటే, కోలుకుంటున్నారంటే కారణం నూటికి నూరుపాళ్ళూ బాలకృష్ణ కారణమని చెప్పారు.
ప్రమాదం లేదన్న చిరంజీవి
ఈ రోజు ఉదయం తారక రత్న ఆరోగ్యం (Taraka Ratna Health) గురించి చిరంజీవి (Chiranjeevi) కూడా ట్వీట్ చేశారు. ”సోదరుడు తారక రత్న త్వరగా కోలుకుంటున్నారు. ‘ఇక ఏ ప్రమాదం లేదు’ అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. అతను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ… ఈ పరిస్థితి నుంచి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. డియర్ తారక రత్న… నీకు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన జీవితం ఉండాలని కోరుకుంటున్నాను” అని చిరంజీవి సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
బెంగళూరులోని నారాయణ హృదయాలయకు వెళ్ళి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ, ఇతర కుటుంబ సభ్యులు పాజిటివ్ గా స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోలుకుంటున్నారని తెలిపారు. తారక రత్న త్వరగా కోలుకుని ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని అభిమానులు, ప్రేక్షకులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.