ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఈసీ కీలక ప్రకటన, ఈ నెల 28న

0

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు ఈ నెల 28న రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా ప్రభావంతో వాయిదాపడ్డ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాన్ని కోరనున్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సంబంధించి సర్క్యులర్ జారీ అయింది. రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత ప్రభుత్వంతో చర్చించనున్నారు.

ఇటు ఎన్నికలకు సంబంధించి 13 జిల్లాలకు నిధులు కూడా విడుదలయ్యాయి.. మొత్తం రూ.8కోట్ల 25 లక్షల 3వేలు విడుల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాకు రూ.52,38,000.. విజయనగరం జిల్లాకు రూ.41, 46,000.. విశాఖపట్నం జిల్లాకు రూ.73,24,500.. తూర్పుగోదావరి జిల్లాకు రూ.82,75,000.. పశ్చిమగోదావరి జిల్లాకు రూ.59,46,000.. కృష్ణా జిల్లాకు రూ.72,91,500.. గుంటూరు జిల్లాకు రూ.80,86,500.. ప్రకాశం జిల్లాకు రూ.58,63,500.. నెల్లూరు జిల్లాకు రూ.52,44,000.. చిత్తూరు జిల్లాకు రూ.66,03,000.. అనంతపురం జిల్లా రూ.67,30,500.. కడప జిల్లా రూ.49,35,000.. కర్నూలు జిల్లా రూ.68,19,000 చొప్పున నిధులు విడుదల చేశారు.

గతంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కరోనావ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

తర్వాత నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా.. కోర్టు గవర్నర్‌ను కలిసి చర్చించాలని సూచించింది. దీంతో బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరారు.. హైకోర్టు తీర్పును అమలు పరచాలని.. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు లేఖ రాశారు. ఆ తర్వాత నిమ్మగడ్డను ప్రభుత్వం మళ్లీ ఎస్‌ఈసీగా నియమించగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై రమేష్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు.