Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ మూడు రాజధానులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర శాసన వ్యవస్థకు చెందినదని.. రాజధాని విషయంలో పార్లమెంట్‌కు సంబంధం లేదన్నారు. ఏపీ విభజన చట్టమూ నిర్ణయాధికారం రాష్ట్రానికే ఇచ్చిందని గుర్తు చేశారు. రాజధానుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని.. మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించలేరని వాదనలు వినిపించారు.

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ రాజధాని ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని దవే గుర్తు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించింది అన్నారు. ఈ క్రమంలో ప్రజాధనం వృథా చేశారని.. అందుకే ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసిందన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని శాసనమండలిలో మొదటిసారి ప్రవేశపెట్టి మూడు నెలలు గడిచాకే వాటిని శాసనసభలో ఆమోదించారని దవే గుర్తు చేశారు.

మండలి ఛైర్మన్‌ బిల్లుల్ని సెలక్టు కమిటీకి సిఫారసు చేశాక వాటిని శాసనసభలో మరోసారి ప్రవేశపెట్టి ఆమోదించడం సభా వ్యవహారాల నిబంధనలను ఉల్లంఘించడమేకదా అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. శాసనసభను చట్టాలు చేయకుండా శాసనమండలి నిలువరించలేదని దవే అన్నారు. శాసనసభ ఎన్నికైన బాడీ అని.. మండలి పెద్దల సభ మాత్రమేనన్నారు. సెలక్టు కమిటీ ఏర్పాటు చేయకుండా జాప్యం జరిగిందన్న పిటిషనర్లు వాదనల సంగతి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. తన సిఫార్సుల్ని అమలు చేయకపోతే గవర్నర్‌ను కానీ హైకోర్టు, మండలి ఛైర్మన్‌ ఆశ్రయించవచ్చన్నారు. బిల్లులు చట్ట రూపం దాల్చకుండా జాప్యం చేయడానికి ఛైర్మన్‌ యత్నించారన్నారు.

ఏపీ హైకోర్టు ప్రధాన బెంచ్‌ను రాజధాని అమరావతిలో నోటిఫై చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం గుర్తు చేసింది. జ్యుడీషియల్‌ క్యాపిటిల్‌ పేరుతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు పాలన వికేంద్రీకరణ చట్టం ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు మాత్రమే ప్రారంభించిందని.. అది ప్రతిపాదనే అన్నారు. చట్టం చేసి ప్రతిపాదన అని ఎలా చెబుతారని హైకోర్టు ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. ప్రధాన బెంచ్‌ ఏర్పాటు అంశానికి అంతిమంగా రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుందన్నారు. రాజధాని విషయంలో అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కమిటీల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం చెప్పింది.