అపాయింట్ మెంట్ అడిగా.. జగన్ ను కలుస్తా: బాలయ్య

0

ఏపీ సీఎంగా జగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయినా.. ఆయన చదువుకునే రోజుల్లో మాత్రం టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణకు పెద్ద ఫ్యాన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య అభిమాన సంఘంలో జగన్ పనిచేశాడని.. ఆయన సినిమా రిలీజ్ అయితే పోస్టర్లు కట్టాడని అప్పట్లో వార్తలు మీడియాలో వచ్చాయి. జగన్ కూడా ఓ సందర్భంలో తాను చదువుకునే రోజుల్లో బాలయ్య ఫ్యాన్ అని అన్నాడు.

ఈ క్రమంలోనే రాజకీయంగా ఎదిగిన జగన్ సీఎం కాగా.. హీరో నందమూరి బాలయ్య టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు.

ఇప్పుడు తన ఫ్యాన్ అయిన జగన్ ను కలవడానికి స్వయంగా నందమూరి బాలయ్య అపాయింట్ మెంట్ కోరారు. ఈ విషయాన్ని బాలయ్యే తెలుపడం విశేషం.

సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం లెటర్ రాశానని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య తెలిపారు. హిందూపురం అభివృద్ధిపై సీఎం జగన్ తో చర్చించడానికేనని అన్నారు. తన నియోజకవర్గంలో పర్యటించి.. తాజాగా హిందూపురం ప్రభుత్వాసుపత్రికి రూ.55 లక్షల విలువైన కరోనా నివారణ ఔషధాలు.. పరికరాలు అందజేశారు.

ఈ సందర్భంగా తాను ఎక్కడున్న హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తానని బాలయ్య అన్నారు. హిందూపురం కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని జగన్ ను కోరుతానని తెలిపారు.