Templates by BIGtheme NET
Home >> Telugu News >> చంద్రబాబుకి బీజేపీ, వైసీపీ క్లీన్ చిట్.. ఇదెలా సాధ్యం.!

చంద్రబాబుకి బీజేపీ, వైసీపీ క్లీన్ చిట్.. ఇదెలా సాధ్యం.!


రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఎప్పుడు ఎవరికి ఎలాంటి మద్దతు ఏ రూపంలో లభిస్తుందో చెప్పలేం. మిత్రులు శతృవులవుతారు, శతృవులు మిత్రులుగా మారతారు. రాజకీయంగా పనైపోతుందనుకుంటున్న సమయంలో ఓ నాయకుడికి అనూహ్యమైన మద్దతు లభిస్తుంటుంది ప్రత్యర్థుల నుండి. టీడీపీ అధినేత చంద్రబాబు గురించే మనం మాట్లాడుకుంటున్నది.

టీడీపీ పనైపోయిందని అంతా అనుకుంటున్న తరుణంలో అటు బీజేపీ, ఇటు వైసీపీ.. సంయుక్తంగా టీడీపీని జాకీలేసి మరీ పైకి లేపుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన బీజేపీ, పోలవరం ప్రాజెక్టుని టీడీపీ ఏటీఎంలా వాడుకుందని ఆరోపించిన విషయం విదితమే. కానీ, ఆ తర్వాత కేంద్రం, చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్టు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చేసింది.

ఇక, నిన్న మొన్నటిదాకా అమరావతి భూముల విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం, చంద్రబాబు అండ్ టీమ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేయడమే కాదు, కేసులు పెట్టి విచారణ కూడా చేయించింది. కానీ, అసలంటూ అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడంలో ఎలాంటి వాస్తవం లేదని న్యాయస్థానం తేల్చేసింది. అలా న్యాయస్థానం ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని కొట్టిపారేయడమంటే, పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చినట్లే.

‘చంద్రబాబు తప్పు చేయడు.. ఎవరికీ తలవంచడు..’ అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారిప్పుడు. నిజమేనా.? చంద్రబాబు పదే పదే చెబుతున్నట్లు ఆయన నిజంగానే నిప్పు లాంటి రాజకీయ నాయకుడేనా.? అంటే, ఔనని ఒప్పుకోక తప్పదేమో.

చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట.. అని అందరూ అంటుంటారు. ఆయన రాజకీయ పార్టీల్నీ, ప్రభుత్వాల్ని కూడా మేనేజ్ చేయగలరని.. తాజా వ్యవహారాల్ని బట్టి అర్థం చేసుకోవాలేమోనంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పడుతున్నాయి. అయినా, వైఎస్ జగన్ సర్కారుని చంద్రబాబు మేనేజ్ చేయడమేంటి.? మోడీ సర్కారుని చంద్రబాబు మేనేజ్ చేయడమేంటి.? ఎవరూ ఊహించని పరిణామాలే ఇవి.

పట్టిసీమ విషయంలో బీజేపీ, వైసీపీ చేసిన ఆరోఫణలు అన్నీ ఇన్నీ కావు.. అదే పట్టిసీమ కారణంగానే, ఇప్పుడు కృష్ణా డెల్టాకి కష్ట కాలంలోనూ ఇబ్బందులు తప్పాయి. అలా పట్టిసీమ విషయంలోనూ చంద్రబాబుకి క్లీన్ చిట్ వచ్చినట్లయ్యింది. చూస్తోంటే, చంద్రబాబుని హీరోగా చూపించేందుకు బీజేపీ, వైసీపీ పోటీపడుతున్నట్లున్నాయి కదూ!