Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఫ్లెక్సీల రచ్చ.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ఫ్లెక్సీల రచ్చ.. వైసీపీలో భగ్గుమన్న విభేదాలు


ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల మధ్య రచ్చ మళ్లీ మొదలైంది. ‘వైఎస్ఆర్ ఆసరా పథకం’ను ఈరోజు రాష్ట్రంలో సీఎం జగన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే చీరాల నియోజకవర్గంలో ఈ కార్యక్రమం గురించి వైసీపీ శ్రేణులు హల్ చల్ చేశాయి. చీరాలలో వైసీపీ నాయకుల ఫ్లెక్సీలు పెట్టడంతో మళ్లీ వివాదం రాజుకుంది.

వైఎస్ఆర్ ఆసరా పథకం ఈరోజు మొదలు కావడంతో చీరాలలో వైసీపీ ఇన్ చార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం దుమారం రేపింది. ప్రస్తుతం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం బలరాం ప్రోద్భలంతోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారని ఆమంచి వర్గం భగ్గుమంది.

అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు చెబుతున్నారు. కానీ ఫ్లెక్సీలు కట్టేముందే పోలీసులు ఈ విషయాన్ని నిర్వాహకులకు చెబతితే ఈ వివాదం ఉండేది కాదు కదా అని ఆమంచి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీని వెనుక ఎమ్మెల్యే కరణం ఉన్నాడని ఆరోపిస్తోంది.

చీరాల నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేకు.. వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు మధ్య ఫైట్ కొద్దిరోజులుగా నడుస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల రచ్చ పీక్స్ కు చేరింది.. చీరాల మున్సిపల్ థియేటర్ దగ్గర ఆమంచి కృష్ణమోహన్ వర్గం పెట్టిన ఫ్లెక్సీలు పోలీసులు తొలగించడంతో మళ్లీ వివాదం రాజుకుంది.

గతంలో వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా పోటాపోటీగా ఫ్లెక్సీలు కట్టేందుకు ఎమ్మెల్యే కరణం బలరాం మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ వర్గీయులు సిద్ధమయ్యారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద కరణం వర్గీయులు ముందుగా ఫ్లెక్సీలు కట్టారు. తమ ఫ్లెక్సీలే కట్టాలంటూ ఆమంచి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఆమంచి వర్గీయులు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు.

ఈ పరిణామాలన్నీ గమనిస్తే నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచి ఎపిసోడ్ సెగలు కక్కుతోందని అర్థమవుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆమంచి కృష్ణమోహన్ ను అదే జిల్లాలోని పర్చూర్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వెళ్లాలని హైకమాండ్ చెప్పింది. కానీ ఆమంచి వినకుండా చీరాలలోనే ఉంటూ రాజకీయం చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

దీంతో ప్రతీసారి పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మనుషులకు ఆమంచికి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్తున్నాయంటున్నారు. ఆమంచి వినకుండా ఇలానే వ్యవహరిస్తే ఆయనను సస్పెండ్ చేసే పరిస్థితి రావచ్చని.. అక్కడదాకా తెచ్చుకోవద్దని హైకమాండ్ సున్నితంగా హెచ్చరించే పరిస్థితి అక్కడ ఉందని అమరావతి టాక్.

ప్రస్తుతం చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం మాటే చెల్లుబాటు అవుతోంది. దీంతో ఆమంచి వర్గం రగిలిపోతుంది.