Templates by BIGtheme NET
Home >> Telugu News >> భారత్ లోకి స్ట్రెయిన్ ఎంట్రీ .. లాక్ డౌన్ దిశగా పళని సర్కార్ !

భారత్ లోకి స్ట్రెయిన్ ఎంట్రీ .. లాక్ డౌన్ దిశగా పళని సర్కార్ !


బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా స్ట్రెయిన్ భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ కొత్త వైరస్ మరింతగా విజృంభించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా తమిళనాడులో కొత్త వైరస్ వెలుగులోకి రావడంతో దానిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈనెల 28వ తేదీన వైద్యనిపుణుల బృందంతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ కరోనా స్ట్రెయిన్ పేరుతో కొత్త వైరస్ కేసు బయటపడింది. రెండు రోజులకు ముందు లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి చేరుకున్న ఇంజనీర్ కి వైద్య పరీక్షలు జరిపినప్పుడు కరోనా స్ట్రెయిన్ తాకిడికి గురైనట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో ఆయనను వెంటనే గిండి కింగ్ ఇన్ స్టిట్యూట్ సమీపంలోని ప్రభుత్వ కరోనా హాస్పిటల్ కి అధికారులు తరలించారు. ఆ ఇంజనీర్ నుంచి సేకరించిన రక్త నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం పుణేలో ఉన్న ప్రయోగశాలకు పంపారు.

ఆ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాతే ఆ వైరస్ నిరోధానికి చర్యలు తీసు కుంటామని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నైలోని జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాలలో తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. అత్యంత నవీన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కరోనా పరీక్షలు జరిపే పరికరాలను కూడా అమర్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈనెల 28న కరోనా వైరస్ నిరోధక చర్యలు చేపట్టే నిమిత్తం వైద్యనిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమవుతున్నారు. కొత్త వైరస్ కారణంగా కఠిన లాక్ డౌన్ ను అమలు చేయాలా వద్దా అనే విషయంపై వైద్యనిపుణుల కమిటీ సభ్యులతో ఆయన సమగ్రంగా చర్చలు జరుపబోతున్నారు.

వచ్చే యేడాది జనవరిలో లాక్ డౌన్ ను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో కరోనా కంటే శక్తివంతమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కొత్త వైరస్ వ్యాప్తిని ఆరంభంలోనే అరికట్టేదిశగా చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమైంది. గత నెల రోజుల వ్యవధిలో ఇంగ్లాండు నుంచి వచ్చిన 2756 మందికి కరోనా వైద్య పరీక్షలు జరిపేందుకు రంగం సిద్ధమైంది. లండన్ నుంచి చెన్నైకి వచ్చిన ఇంజనీర్ కు వైద్యపరీక్షలు జరిపినప్పుడు అతడికి కరోనా స్ట్రెయిన్ లక్షణాలు వున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో గత నెల రోజల వ్యవధిలో ఇంగ్లాండులోని పలు నగరాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సేకరించారు. ఆ మేరకు ఇంగ్లాండు నుంచి రెండు రోజులకు ముందు చెన్నైకి వచ్చిన 218 మందికి రెండువారాలకు ముందు వచ్చిన 1791 మందికి అంతకు రెండు వారాల మునుపు వచ్చిన 965 మందికి కరోనా వైద్యపరీక్షలు జరపాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు.