12 ఏళ్లు పై బడిన చిన్నారులకి కరోనా వ్యాక్సినేషన్ !

0

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ వేవ్ నుండి కోలుకునేలోపే సెకండ్ వేవ్ వచ్చి దేశాన్ని అతలాకుతలం చేసింది. సెకండ్ వేవ్ లో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే వేల కొద్ది మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ తగ్గిందిలే అని కొంచెం కుదుటపడేలోపే మూడో వేవ్ ముప్పు పొంచుకుకూర్చుంది అని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్ వస్తుందని అది పిల్లలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. సెప్టెంబర్ నుంచి 12-18 ఏళ్ల మధ్య వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ చీఫ్ ఎన్కే అరోరా వెల్లడించారు.

జైడస్ వ్యాక్సిన్ నే వీరికి వేయనున్నట్లు కూడా ఆయన చెప్పారు. రానున్న వారాల్లో జైడస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు లభిస్తాయని కూడా అరోరా తెలిపారు. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇవి సెప్టెంబర్ చివరి నాటికి పూర్తవుతాయి. అప్పటికే వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని అనుకుంటున్నాను. మూడో త్రైమాసికం లేదా వచ్చే జనవరి ఫిబ్రవరిలోపు 2 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇస్తాము. అయితే జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ మాత్రం 12-18 ఏళ్ల వారికి ఆలోపే అందుబాటులోకి వస్తుంది అని అరోరా స్పష్టం చేశారు. స్కూళ్లను పునఃప్రారంభించడం అన్నది చాలా ముఖ్యమని దీనిపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ మూడో దశ ముప్పు నేపథ్యంలో చిన్నారులకు టీకాలు ఇచ్చే అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అంతేగాక పాఠశాలల పున ప్రారంభం చాలా ముఖ్యమైన విషయమని దీనిపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ రెండు దశల్లో చిన్నరులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తల దృష్ట్యా విద్యాసంస్థలను ప్రభుత్వాలు తెరవడం లేదు.

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపుతుందన్న ఆందోళనల నేపథ్యంలో దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో పీడియాట్రిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికితోడు ప్రతి రాష్ట్రం/యూటీలో పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో మెరుగైన వసతుల కల్పన కోసం రూ.23 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. . మొదటి వేవ్ వృద్ధులపై ప్రభావం చూపిందని.. రెండో వేవ్లో యువకులు బాధితులయ్యారని.. ఇక మూడో వేవ్లో ఈ కరోనా రక్కసి చిన్న పిల్లలనే కాటేస్తుందని ఈ మధ్య ప్రచారం ఎక్కువైంది. ఒకసారి గణాంకాలను చూస్తే.. మొదటి వేవ్లో పదేళ్లలోపు చిన్నారులు 3.28 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే రెండో వేవ్లో 3.05 శాతం మాత్రమే కొవిడ్ -19 బారిన పడ్డారు. అంటే రెండో వేవ్లో వైరస్ సోకిన పిల్లల శాతం తగ్గింది. అదే 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న వారిని గమనిస్తే ఫస్ట్ వేవ్లో 8.03 శాతం మంది.. సెకండ్ వేవ్లో 8.57 శాతం మంది కరోనా బాధితులయ్యారు. అంటే రెండో వేవ్లో పెరుగుదల 0.54 శాతం మాత్రమే. కాబట్టి ఈ గణాంకాల ప్రకారం చూసుకుంటే.. థర్డ్ వేవ్లో చిన్నారులే ప్రభావితం అవుతారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కొవిడ్ తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అయితే కొవిడ్-19 అనంతరం వచ్చే దుష్ప్రభవాలు మాత్రం పిల్లల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలామంచిది.