హైదరాబాద్ లో వరదసాయంపై హైకోర్టు కీలక ఆదేశం

0

ఇటీవల వర్షాలకు మునిగిన హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హఠాత్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ సాయం ఆగిపోయింది. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

దీనిపై కొందరు హైకోర్టుకు ఎక్కారు. వరదసాయం కొనసాగించాలనే పిటీషన్ పై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటీషనర్ శరత్ కోర్టులో తమ వాదన వినిపించారు. ప్రభుత్వం కూడా వాస్తవ పరిస్థితిని వివరించింది. వాదనలు విన్న హైకోర్టు హైదరాబాద్లో వరదసాయం గ్రేటర్ ఎన్నికల తర్వాత కంటిన్యూ చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికలు జరుగుతున్న వేళ ఇవ్వడానికి వీల్లేదని తెలిపింది.

కేంద్ర ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్టే జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. వరద బాధితుల కోసం విడుదల చేసిన ఫండ్ ని కొందరు పార్టీ వాళ్లకే ఇస్తున్నారని.. అందుకే ఈ పథకాన్ని ఆపాలని నిర్ణయించామని ఈసీ కోర్టుకు వివరించింది.

గత నెల 20వ తేదీన ప్రారంభమైన పథకం పది రోజులు ఆపితే ఎలాంటి నష్టం లేదని ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. వాదనలు విన్నాక వచ్చే నెల 4 న కౌంటర్ ధాఖలు చేసి పూర్తి నివేదిక సమర్పించాలని దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 4వ తేదీ తర్వాత డబ్బుల పంపిణీ చేయొచ్చని తెలుపుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.