Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా : మరో కొత్త ప్రమాదం.. ఊపిరితిత్తులకు యమా డేంజర్

కరోనా : మరో కొత్త ప్రమాదం.. ఊపిరితిత్తులకు యమా డేంజర్


కొవిడ్ వైరస్ వెలుగు చూసి ఏడాది గడిచింది. నెలక్రితం వరకు కాస్త తగ్గుముఖం పట్టినా కేసుల సంఖ్య.. “సెకండ్ వేవ్” విజృంభణతో రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గత శనివారం ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షల 3 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్నాయి. మానవాళికే సవాల్ విసురుతున్న ఈ వైరస్ నివారణకు పూర్తి స్థాయి వ్యాక్సిన్ సంగతి అటుంచితే.. అసలు ఇప్పటి వరకు వ్యాధి తీవ్రత ఎంత? ఎవరి మీద ఎలా పనిచేస్తుంది? ఎంతకాలం ప్రభావం చూపుతుంది? అనే విషయం కూడా అంతు చిక్కలేదు.

తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో.. కరోనాకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగు చూసింది. కొవిడ్ బారిన పడి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా.. ఊపిరి తిత్తులపై వైరస్ ప్రభావం కనిపిస్తోందన్నది ఆ పరిశోధన సారాంశం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 10 మంది కొవిడ్ వ్యాధిగ్రస్తులపై జరిపిన పరిశీలనలో నిపుణులు ఈ విషయాన్ని గుర్తించారు. ఊపిరితిత్తులను పరీక్షించేందుకు వాడే స్కానింగ్ యంత్రాలకు కూడా దొరకని అనేక విషయాలు ఈ పరిశోధనలో బయటపడ్డాయని వైద్యులు వెల్లడించారు.

19 నుంచి 69 సంవత్సరాల మధ్య వయస్కులైన 10 మంది కొవిడ్ పేషెంట్లను ఈ పరిశోధనకు ఎంచుకున్నారు. ప్రొఫెసర్ ఫెర్గస్ గ్లీసన్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన జరిపింది. ఈ పది మంది వ్యాధి గ్రస్తుల్లో.. ఎనిమిది మంది దాదాపు మూడు నెలల పాటు శ్వాస సంబంధమైన సమస్యలతోపాటు అలసట వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ పరిశీలన కోసం ఊపిరితిత్తులకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసే సమయంలో “జెనాన్” అనే గ్యాస్ను ఉపయోగించారు. ఈ స్కానింగ్ ద్వారానే కొవిడ్ పేషెంట్ల ఊపిరితిత్తులలో దీర్ఘకాలం కొనసాగడానికి అవకాశం ఉన్న సమస్యలు కనిపించాయని నిపుణులు వెల్లడించారు. కరోనా సోకడానికి ముంద వీరిలో ఎవరికీ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం గానీ వెంటిలేషన్ మీద ఉండాల్సిన పరిస్థితి గానీ రాలేదని తెలిపారు. అంతేకాదు.. వీరికి మొదట నిర్వహించిన సాధారణ స్కాన్లో ఏ సమస్యా లేదని తేలడం గమనార్హం.

ఇంకా… వ్యాధి గ్రస్తుల రక్తంలో ఆక్సిజన్ సరైన పరిమాణంలో కలవడం లేదని గుర్తించారు. అంతే కాకుండా.. ఈ మూడు నెలల్లో కొన్నాళ్లు శ్వాస సంబంధమైన సమస్యను ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ పరిశోధన ద్వారా.. కొవిడ్ పేషెంట్లలో ఊపిరితిత్తులు ఎంతవరకు చెడిపోతాయి అనే విషయం తెలుసుకోవడమే తమ లక్ష్యమని ప్రొఫెసర్ గ్లీసమ్ వెల్లడించారు. కొవిడ్ కారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో మరణాలు ఎక్కువగా ఉన్నాయని తమ పరిశోధనలో ఊపిరితిత్తుల సమస్య ఇంకా ఎక్కువ స్థాయిలో ఉందని తేలితే మాత్రం.. ఇప్పటి వరకు అనుసరిస్తున్న వైద్య విధానాల పద్ధతులను చాలా వరకు మార్చుకోవాల్సి ఉంటుందని ప్రొఫెసర్ గ్లీసన్ చెప్పారు. ఈ ఫలితాల కోసం తాము మరో 100 మందిపై పరిశోధనలు జరపనున్నట్టు చెప్పారు.

ఇదీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితి. ఓవైపు వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎవరి ప్రయత్నం వారు చేస్తుండగా.. మరోవైపు వైరస్ తాలూకు దుష్ప్రభావాలు రోజుకో రీతిన బయటపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ చేయగలిగిందీ చేయాల్సిందీ వైరస్ సోకకుండా చూసుకోవదం మాత్రమే. కాబట్టి మాస్కు తప్పక ధరించండి.. భౌతిక దూరం పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉండండి.. సమాజం ఆరోగ్యంగా ఉండడానికి సహకరించండి.