పొగుడుతూ మోడీ లేఖ.. థ్యాక్స్ చెప్పిన ధోని

0

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆగస్టు 15 సాయంత్రం ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో తనను ప్రేమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే ధోని నిర్ణయం ఆయన అభిమానులను షాక్ కు గురిచేసింది. సినీ క్రీడా రాజకీయ ప్రముఖుల నుంచి ధోని గొప్పతనంపై ట్వీట్లు పోస్టులు వెల్లువెత్తాయి.

ప్రధాని నరేంద్రమోడీ కూడా ఎంఎస్ ధోని గొప్పతనంపై స్పందించడం విశేషం. భారత జట్టును ప్రపంచ ఛాంపియన్ గా మార్చిన మహేంద్ర సింగ్ ధోనీపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపిస్తూ లేఖ పంపారు. లేఖలో భారత జట్టుకు మూడు ఐసిసి ట్రోఫీలను అందించిన గొప్ప క్రీడాకారుడిగా ధోనిని పొగిడాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్లుగా అద్భుతంగా సేవలందించినందుకు ప్రధాని లేఖ రాయడంపై తాజాగా ధోని స్పందించాడు. ట్విట్టర్లో ప్రధాని మోడీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. “ఒక కళాకారుడు సైనికుడు మరియు క్రీడాకారుడు వారు కోరుకునేది ప్రశంసలు.. వారి కృషి మరియు త్యాగం అందరిచేత గుర్తించబడుతోంది. ప్రశంసించబడుతోంది. మీ ప్రశంసలు.. శుభాకాంక్షలకు నాకు అందించినందుకు ధన్యవాదాలు మోడీజీ” అంటూ ధోని ట్వీట్ బదులిచ్చాడు.

ఎంఎస్ ధోని 2004 సంవత్సరంలో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి అతను భారత జట్టు కోసం ఆడుతూ ప్రపంచకప్ లు సాధించిపెట్టాడు. ప్రపంచ క్రికెట్లో ఉత్తమ ఫినిషర్గా పేరు సంపాదించాడు. ధోని కెప్టెన్సీలో టీం ఇండియా మూడు ఐసిసి ట్రోఫీలను గెలుచుకుంది. వన్డే ప్రపంచ కప్ టి20 ప్రపంచ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకున్న ఏకైక భారత కెప్టెన్గా ధోని నిలిచాడు.

16 సంవత్సరాల క్రికెట్ కెరీర్లో ధోని మూడు ఫార్మాట్లలో 17000 పరుగులు చేశాడు. అతను 800 కి పైగా స్టంప్ అవుట్లు చేశాడు. భారత్ క్రికెట్ లో అత్యుత్తమ కీపర్ గానూ ప్రశంసలు అందుకున్నాడు.