Templates by BIGtheme NET
Home >> Telugu News >> జర్మనీలో చిక్కుకుపోయిన విమానాలు.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం..

జర్మనీలో చిక్కుకుపోయిన విమానాలు.. ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం..


జర్మనీలోని మ్యూనిచ్‌ ఎయిర్‌పోర్టు పెను మంచుతుపానులో చిక్కుకుపోయింది. ఫలితంగా 760 విమానాలు రద్దయ్యాయి. ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టును తెరిచినట్లు ప్రకటించినా.. ప్రజలు మాత్రం చూసుకొని ప్రయాణాలను ప్రారంభించాలని విమానాశ్రయ వర్గాలు పేర్కొన్నాయి. దుబాయ్‌లో పర్యావరణంపై జరుగుతున్న కాప్‌ సదస్సుకు ఉన్నతాధికారులతో బయల్దేరిన ఒక ప్రైవేట్‌ జెట్‌ రన్‌వేపై మంచులో కూరుకుపోయింది. 

మ్యూనిచ్‌ నగరంలోని బస్సులు, రైలు సర్వీసులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడి సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ను మూసివేశారని జర్మనీ జాతీయ రైల్వే కంపెనీ వెల్లడించింది. ఇక్కడి ప్రధాన స్టేషన్‌లో భారీ సంఖ్యలో ప్రజలు చిక్కుకుపోయారు. సోమవారం వరకు రైలు సర్వీసులు కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం కానున్నాయని వెల్లడించింది. ఇక్కడి రైల్వే ట్రాక్‌లను పరిశీలించడానికి హెలికాప్టర్లను రంగంలోకి దించారు. జర్మనీలోని బవారియా రాష్ట్రంలో చాలా చోట్ల చెట్లు కుంగిపోవడంతో వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మంచు కారణంగా 350 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

మరోవైపు భారీగా హిమపాతం కారణంగా స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా, చెక్‌రిపబ్లిక్‌ దేశాల్లోని పలు ఎయిర్‌ పోర్టుల్లో కూడా సమస్యలు తలెత్తాయి. జ్యూరిచ్‌ ఎయిర్‌ పోర్టు నుంచి బయల్దేరే విమానాల్లోనూ జాప్యం నెలకొంది. ఆస్ట్రియాలో కొన్ని చోట్ల ఒక్క రాత్రే దాదాపు 20 అంగుళాల మేరకు మంచు కురిసింది.