Templates by BIGtheme NET
Home >> Telugu News >> కొత్త దందా.. పెళ్లిళ్లలో చోరీ.. ఒక్కరికి రూ.12 లక్షలు

కొత్త దందా.. పెళ్లిళ్లలో చోరీ.. ఒక్కరికి రూ.12 లక్షలు


కొద్దినెలలుగా ఢిల్లీలోని పలు ఫంక్షన్ హాల్స్ లో భారీగా నగలు డబ్బు మాయం అవుతోంది. అతిథులు పెళ్లి హడావుడిలో ఉండగా.. దొంగలు పనికానిచ్చేస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ తరహా దొంగతనాలకు సంబంధించి లెక్కలేనన్ని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. నగరంలో భారీ వివాహ వేడుకలు జరిగే ఫంక్షన్ హాల్స్ వివరాలు సేకరించి.. అక్కడికి వెళ్లి దర్యాప్తు చేశారు. సీసీటీవీ కెమరా రికార్డులను పరిశీలించారు. ఇక కొన్ని ఫంక్షన్ హాల్స్ దగ్గర ఇన్ఫార్మర్లను ఉంచారు. అనుమానితులకు సంబంధించిన సమాచారం బయటపడింది.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ పిల్లలను లీజుకు తీసుకొని పెళ్లిళ్లలో దొంగతనాలు చేయిస్తున్న వైనం ఈ విచారణలో వెలుగుచూస్తోంది. తాజాగా ఓ గ్యాంగ్ పెళ్లిళ్లలో దొంగతనం ఎలా చేయాలో పిల్లలకు శిక్షణ ఇస్తున్నారట.. పిల్లలను లీజుకు ఇచ్చినందుకు గాను ఒక్కొక్క పిల్లవాడి తల్లిదండ్రులకు ఏకంగా రూ.10-12 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు.

గత వారం ఓ భారీ వివాహానికి హాజరై చేతివాటం చూపి నగదుతో ఉడాయిస్తున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరిని విచారించగా సంచలన విషయాలు తెలిశాయి.

పిల్లలకు మంచి దుస్తులు ధరింపచేస్తున్నారు. అతిథులతో కలిసిపోయేలా శిక్షణ ఇస్తున్నారు. దొంగతనం చేసి పట్టుబడినప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది. బిగ్ షాట్స్ పెళ్లిళ్లకు పిల్లలను పంపి ఈ దొంగతనాలు చేయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

గ్యాంగ్ సభ్యులంతా ఒక చోట చేరుకొని నగదును పంచుకొని తర్వాత ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోతున్నారు. తాజాగా పోలీసులకు చిక్కి ఈ దందా మోసాలు వెలుగుచూశాయి.