జగన్ కు షాక్… నిలిపిన వేతనాలు వడ్డీతో చెల్లించాల్సిందేనట

0

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలు కీలక విషయాల్లో జగన్ సర్కారు నిర్ణయాలను తప్పుబట్టిన హైకోర్టు… తాజాగా మరో కీలక విషయంలోనూ జగన్ సర్కారుకు తలంటేసింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోతలను విధిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన జీవోలు చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా నిలిపిన వేతనాలను వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని కూడా హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. ఈ చెల్లింపులన్నీ కూడా రెండు నెలల్లోగా పూర్తి కావాల్సిందేనని కూడా జగన్ సర్కారుకు హైకోర్టు గడువు విధించింది.

ఈ కేసు పూర్వపరాల్లోకి వస్తే… కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బ తిన్నదని ఈ కష్ట సమయంలో ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇవ్వలేమని కొంత మొత్తంలో కోత పెట్టి మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు మార్చి ఏప్రిల్ నెలల్లో రెండు జీవోలు విడుదల చేసింది. ఈ జీవోల ప్రకారం అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం ఇతర ఉద్యుగుల వేతనాల్లో 50 శాతం నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం మేర కోత విధించింది. ఉద్యోగుల వేతనాలతోనే సరిపెట్టని జగన్ సర్కారు… చివరకు పెన్షనర్ల పెన్షన్ పైనా కోత విధించింది.దీనిపై రిటైర్డ్ జిల్లా న్యాయాధికారి లక్ష్మీకామేశ్వరి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అత్యయిక పరిస్థితిని ప్రకటించని నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో కోత విధించడం చట్టవిరుద్ధమని ఆమె హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్. లలిత జస్టిస్ సత్యనారాయణమూర్తిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం… పిటిషనర్ వాదనతో ఏకీభవించారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించకుండా ఉద్యోగుల వేతనాల్లో కోత ఎలా విదిస్తారని జగన్ సర్కారును ప్రశ్నించింది. ఉద్యోగుల వేతనాలతో పాటు పెన్షన్లలోనూ కోత విధించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అంతేకాకుండా పిటిషనర్ లేవనెత్తిన అంశాలు న్యాయసమ్మతమైనవేనని అంగీకరిస్తూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అంతటితో ఆగని కోర్టు… ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోతలకు సంబంధించిన మొత్తాన్ని రెండు నెలల్లోగా 12 శాతం వడ్డీని కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.