Templates by BIGtheme NET
Home >> Telugu News >> మహిళా క్రికెటర్ గోస్వామి వరల్డ్ రికార్డ్

మహిళా క్రికెటర్ గోస్వామి వరల్డ్ రికార్డ్


ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్-2022 టోర్నీలో ఇంగ్లండ్ జట్టు చేతిలో భారత్ జట్టు పరాజయం పాలైంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శననివ్వడంతో టీమిండియా ఓడిపోయింది. న్యూజిలాండ్తో ఓటమి తర్వాత కరేబియన్ జట్టుపై ఘన విజయం సాధించిన మిథాలీ సేన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 36.2 ఓవర్లలో కేవలం 134 పరుగులకు కుప్పకూలింది.

స్మృతి మంధాన 35 పరుగులు రిచా ఘోష్ 33 పరుగులు ఝులన్ గోస్వామి 20 పరుగులు చేయగా మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ షార్లెట్ డీన్ 4 వికెట్లతో భారత పతానాన్ని శాసించింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి వరల్డ్ కప్ లో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 4 మ్యాచ్ల్లో రెండు విజయాలు రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. మహిళల క్రికెట్ వన్డే ఫార్మాట్లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా గోస్వామి చరిత్ర పుటలకెక్కింది. ఇంగ్లండ్ ఓపెనర్ టామీ బీమౌంట్ను అవుట్ చేసిన గోస్వామి ఈ ఘనత సాధించింది. ఆ వికెట్ తో ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా కూడా గోస్వామి రికార్డు సృష్టించింది.

ప్రపంచకప్ టోర్నీలలో 40 వికెట్లు సాధించిన గోస్వామి…అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారత్ తరఫున ఐదు ప్రపంచకప్ లలో ప్రాతినిథ్యం వహించి గోస్వామి.. తాజా రికార్డుతో ప్రపంచ మహిళా క్రికెట్ లో ఏ బౌలర్ సాధించలేని ఘనతను సొంతం చేసుకుంది. ఈ రోజు ఇంగ్లండ్ పై తీసిన వికెట్ తో అంతర్జాతీయ క్రికెట్ లో గోస్వామి 350వ వికెట్ మైలురాయిని కూడా చేరుకుంది.