Templates by BIGtheme NET
Home >> Telugu News >> చైనా బ్యాంక్ కు భారీ మొత్తం రుణపడ్డ మోడీ సర్కార్?

చైనా బ్యాంక్ కు భారీ మొత్తం రుణపడ్డ మోడీ సర్కార్?


భారత్ చైనా సరిహద్దుల్లో కొంతకాలంగా తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల నేపథ్యంతోపాటు భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 118 యాప్ లను భారత్ నిషేధించింది. దీంతో చైనా ఆర్థికంగా నష్టపోయింది. అయినప్పటికీ చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలో చైనాలోని ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) నుంచి భారత్ రూ.9200 కోట్ల రూపాయల రుణం తీసుకుందన్న విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ప్రకారం పార్లమెంటులో ఆర్థికశాఖా సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన లిఖితపూర్వక ప్రకటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఓ పక్క చైనాను ఆర్థికంగా దెబ్బకొడుతోన్న భారత్ మరోవైపు చైనా నుంచి రుణం తీసుకుందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఒకవైపు భారత సైనికులు చనిపోతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. “మోదీ ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా చైనా సైన్యంతో ఉందా” అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) తో భారత్ రెండు రుణ ఒప్పందాలపై సంతకాలు చేసిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. కోవిడ్-19 అత్యవసర చర్యలు ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్రాజెక్టుకు పాక్షిక మద్దతు అందించడానికి ఆ నిధులు తీసుకున్నామని తెలిపారు. మొత్తం 125 కోట్ల డాలర్ల రుణాలు అంటే 9200 కోట్ల రూపాయల కంటే ఎక్కువని వాటి నుంచి భారత్కు ఇప్పటివరకూ 100 కోట్ల డాలర్లు అంటే దాదాపు 7300 కోట్లు మాత్రమే అందాయని వెల్లడించారు. దీంతో మోడీ సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో ఆ బ్యాంకు కథాకమామిషుపై చర్చ మొదలైంది. ఈ చర్చలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ బ్యాంక్ చైనాలో ఉందని ఆ బ్యాంకులో భారత్ సహా అనేక దేశాలతో పాటు చైనాకు వాటా ఉందని తేలింది. భారత్ ఈ బ్యాంక్ వ్యవస్థాపక దేశాల్లో ఒకటి. ప్రస్తుతం ఈ బ్యాంకులో 103 సభ్య దేశాలున్నాయి. ఈ బ్యాంక్లో అత్యధికంగా చైనాకు 26.59 శాతం వాటా ఆ తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు అయిన భారత్కు 7.61 శాతం వాటా ఉంది. ఆ తర్వాత రష్యా జర్మనీ పెద్ద వాటాదారులుగా ఉన్నాయి. ఆసియా అక్కడి కోట్లాది ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం శాశ్వత మౌలిక సదుపాయాల్లో ఇతర ఉత్పాదక రంగాల్లో తాము పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ బ్యాంకు స్పష్టంగా చెబుతోంది.

ఏఐఐబీ ఒక మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఆసియాలో సామాజిక ఆర్థిక ఫలితాలను మెరుగుపరచడమే దాని లక్ష్యం అని తెలిసింది. ఈ బ్యాంక్ పనితీరును బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చూస్తుంటారు. వీరిలో ప్రతి దేశం నుంచి ఒక్కో గవర్నర్ మరో ప్రత్యామ్నాయ గవర్నర్ ఉంటారు. భారత్ నుంచి గవర్నర్గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యామ్నాయ గవర్నర్గా భారత ప్రభుత్వ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఉన్నారు.

ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా ఈ బ్యాంకు అధ్యక్షుడు ఎంపికవుతారు. ప్రస్తుతం చైనాకు చెందిన జిన్ లికు ఈ బ్యాంకు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అయితే చైనాకు ఎక్కువ ఓట్ల షేర్ ఉండడంతో ఏఐఐబీపై చైనా నియంత్రణ ఉందనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. చైనా దగ్గర అత్యధికంగా 3 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్ దగ్గర 85924 ఓట్లు ఉన్నాయి. ఏఐఐబీ నుంచి రుణాలు తీసుకునే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా భారత్ ఉంది.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రభావిత దేశాలకు సాయం కోసం ఏఐఐబీ 5 బిలియన్ డాలర్ల ఒక రిలీఫ్ ఫండ్ ఏర్పాటుచేసింది. దాని ద్వారా ఈ బ్యాంక్ ఎక్కువగా భారత్కు సాయం చేసింది. దీంతో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలోనూ చైనా నుంచి భారత్ రుణాలు తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది. కోవిడ్-19 కట్టడి కోసం ఈ ఫండ్ నుంచి భారత్ 125 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది. ఈ ఫండ్ నుంచే. దీనితోపాటూ దేశంలో జరిగే చాలా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ ఏఐఐబీ నుంచి ఇప్పటికే 3 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుంది. ఈ ఫండ్ నుంచి ఫిలిప్పీన్స్ ఇండోనేషియాలకు 75 కోట్ల డాలర్లు పాకిస్తాన్కు 50 కోట్ల డాలర్లు బంగ్లాదేశ్కు 25 కోట్ల డాలర్లు కూడా ఇచ్చింది. జపాన్ అమెరికాల ఆధిపత్యం ఉండే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ)కు పోటీగా చైనా ఈ బ్యాంక్ను స్థాపించింది. ఈ వివరాలను బట్టి ఏఐఐబీపై చైనా ప్రభావం ఎక్కువే ఉన్నప్పటికీ బ్యాంకు పూర్తిగా చైనా నియంత్రణలో లేదన్న విషయం స్పష్టమైందని చెప్పవచ్చు.