సీఎం జగన్ ఆటవిడుపు.. బ్యాటింగ్ లో ప్రొఫెషనలిజం!

0

సీఎం జగన్ క్రీజులో స్టాన్స్ తీసుకున్నారు.. బాల్ డెలివరీ కోసం వేచి చూస్తున్నారు.. పర్ఫెక్ట్ గ్రిప్ తో ఈజీ ఫుట్ వర్క్ తో బంతిని లాంగ్ ఆన్ మీదుగా తరలించారు. చూస్తున్నవారంతా ఆనందంగా చప్పట్లు కొట్టారు. ఈ సారి మరో బంతి.. డెలివరీ అయ్యింది. ఫుట్ వర్క్ బ్యాక్ తీసుకొని లెగ్ సైడ్ సింపుల్ గా బంతిని తరలించేశారు. ప్రేక్షకులంతా ఆనందం వ్యక్తంచేశారు.

కడప అనంతపురం రెండు జిల్లాలో పర్యటనలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా తన తాత రాజారెడ్డి పేరుమీద కడపలో నిర్మించిన గ్రౌండ్ ను సందర్శించారు. ఈ స్టేడియంలో రూ.4 కోట్ల వ్యయంతో ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ను కాసేపు క్రికెట్ ఆడాలని స్థానిక ఆటగాళ్లు కోరారు. దీంతో.. వారి మాట కాదనలేక బ్యాట్స్ మెన్ గా మారిపోయారు జగన్. అయితే.. జగన్ ఎలాంటి ప్లేయర్ అన్నది అప్పటి వరకూ అక్కడున్న చాలా మందికి తెలియదు. కానీ.. హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని క్రీజులోకి వెళ్లిన జగన్.. తనదైన ఆట తీరుతో అలరించారు. ఆయన ఆడిన విధానం చూస్తే.. చదువుకునే రోజుల్లో బాగానే క్రికెట్ ఆడి ఉంటారనే విషయం స్పష్టమవుతోంది.

కడప ఎంపీ అవినాష్ రెడ్డి బౌలింగ్ చేయగా.. జగన్ సింపుల్ గా షాట్ కొట్టిన విధానం ఫుట్ వర్క్ ఆయనలోని ఆటను చాటిచెప్పాయి. మొత్తానికి ఈ పర్యటనలో తాను ఎలాంటి బ్యాట్స్ మెన్ అన్నది అందరికీ తెలియజేశారు. అదే సమయంలో.. నిత్యం సమీక్షలు సమావేశాల్లో మునిగిపోయే ముఖ్యమంత్రి.. కాసేపు ఆటవిడుపుగా సేదతీరినట్టు అయ్యింది. ఇందుకు సంబంధించిన చిత్రాలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.