Templates by BIGtheme NET
Home >> Telugu News >> నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?

నష్టాలు చూపెట్టి..300 కోట్ల పన్ను ‘రాంకీ’ ఎగ్గొట్టిందా?


వైసీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన ‘రాంకీ’ గ్రూప్ సంస్థలకు ఆదాయపు పన్నుశాఖ గట్టి షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ లోని ‘రాంకీ’ కంపెనీలు యజమానుల ఇళ్లలో ఐటీశాఖ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నల్లధనం బయటపడినట్లు ఇవాళ ఐటీశాఖ ప్రకటించింది. స్టాక్ మార్కెట్ తోపాటు ఇతర లావాదేవీల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు ఐటీశాఖ గుర్తించింది.

వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూపులోని పలు సంస్థల కార్యాలయాల్లో ఈనెల 6వ తేదీన ఐటీ అధికారులు 15 బృందాలతో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భారీ ఎత్తున నగదును గుర్తించినట్టు తెలిసింది. దాదాపు 1200 కోట్ల కృతి నష్టాలను చూపినట్లు కూడా అధికారులు ప్రకటనలో తెలిపారు. భారీగా డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని పరిశీలించగా లెక్కల్లో లేని రూ.300 కోట్ల ఆదాయం బయటపడినట్లు ఐటీశాఖ అధికారులు ప్రకటించారు.

రాంకీ గ్రూపు సంస్థలు రూ.288 కోట్ల మేర వసూలు కానీ బాకీలను చూపెట్టారని.. వీటిని ఆదాయం నుంచి తొలగిస్తామని ఐటీ అధికారులు తెలిపారు. ఐటీ సోదాల్లో బయటపడిన బ్లాక్ మనీకి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించేందుకు రాంకీ గ్రూప్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

వైసీపీ ఎంపీల్లో అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీగా అయోధ్య రామిరెడ్డికి పేరుంది. తాను రాజ్యసభ ఎంపీగా కాగానే ‘రాంకీ’ గ్రూపు సంస్థల డైరెక్టర్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఇలాంటి ఐటీ ఈడీ దాడులతో తనకు చెడ్డ పేరు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన కుటుంబసభ్యులు బంధువులు ఈ సంస్థలను ఇప్పుడు నడుపుతున్నట్టు తెలిసింది.