Templates by BIGtheme NET
Home >> Telugu News >> మరో వెనకడుగు.. ఈసారి ఎల్ఆర్ఎస్ పై కేసీఆర్ యూటర్న్

మరో వెనకడుగు.. ఈసారి ఎల్ఆర్ఎస్ పై కేసీఆర్ యూటర్న్


ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు నెలల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసి మరీ.. కొత్తగా.. కొంగొత్త విధానాల్ని తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన సీఎం కేసీఆర్ ఎట్టకేలకు వెనకడుగు వేశారు. ఎల్ఆర్ఎస్ పై ఇంతకాలం ఆయన వినిపిస్తున్న వాదనకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వెనుకటి విధానాన్ని కొత్తగా తెర మీదకు తీసుకొచ్చారు. కొన్ని చిన్నమార్పులు మినహా మిగిలినదంతా సేమ్ టు సేమ్ అన్నట్లుగా తాజా ఉత్తర్వులు ఉండటం గమనార్హం.

ఇప్పటికి రిజిస్ట్రేషన్లు జరిగిన వాటికి ఎల్ఆర్ఎస్ తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అయితే.. కొత్త ప్లాట్లు.. అంటే ఇప్పటివరకు ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్లు జరగని వాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ తప్పనిసరిగా తేల్చారు. ఈ విధానం కారణంగా ఇంతకాలం ఇబ్బందులు పడుతున్న వారందరి కష్టాలు తీరినట్లే. దీంతో.. ఆగస్టు 26న ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవరించినట్లుగా చెప్పాలి.

గడిచిన వారం రోజుల్లో పలు నిర్ణయాలు వడివడిగా తీసుకుంటున్న కేసీఆర్.. తాజాగా ఎల్ఆర్ఎస్ మీద వెనక్కి తగ్గటం చూస్తే.. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవటమే లక్ష్యమన్నట్లుగా వ్యవహరిస్తోందని చెప్పక తప్పదు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్లలో అత్యధికం పాతవి కావటంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా.. లక్షలాది మందికి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు.

కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం క్రమబద్ధీకరించిన వాటి రిజిస్ట్రేషన్లకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని తేల్చారు. అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిపివేశారు. అదే సమయంలో.. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని.. ఇదే చిట్టచివరి అవకాశంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రతి దరఖాస్తుకు రూ.వెయ్యి కట్టాలని పేర్కొంది. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25.59 లక్షల అప్లికేషన్లు క్రమబద్ధీకరణ కోసం వచ్చాయి. ఆగస్టు నుంచి కొత్త విధానాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ సర్కారు.. తాజా ఉత్తర్వులతో తన కొత్త నిర్ణయాన్ని మార్చేసుకోవటం గమనార్హం.