అతడి భార్య నిండు గర్భిణి. కొద్ది రోజుల్లో ఆ ఇంట్లో ఓ చిన్నారి అడుగు పెట్టబోతోంది. కుటుంబమంతా ఆ సంతోష క్షణాల కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటి సమయంలోనూ అతడు తన విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశీ గడ్డకు తీసుకు రావాలనుకున్నాడు. వారిని వాళ్ల కుటుంబ సభ్యులతో కలపడమే సంతోషంగా భావించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ‘ఇప్పుడే ల్యాండ్ అయ్యాం’ అని తనవారికి కబురు పంపాల్సిన చోట, అతడి చావు వార్త అందించాల్సి వచ్చింది. ఆ విషయాన్ని గర్భిణి అయిన అతడి భార్యకు చెప్పే ధైర్యం లేక కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. కేరళ విమాన ప్రమాదంలో మృత్యువాతపడ్డ కో-పైలట్ అఖిలేష్ కుమార్ (32) దీన గాథ ఇది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని మథురకు చెందిన అఖిలేశ్ కుమార్ కొన్నేళ్లుగా ఎయిరిండియాలో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో మందిని సుక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్‌లో భాగంగా కీలక విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా మే 8, 2020న ఎయిరిండియా విమానంలో దుబాయ్‌కు బయలుదేరారు. నాడు ఆయన బృందానికి కొజికోడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సరిగ్గా 3 నెలల తర్వాత ఆగస్టు 7న అదే చోట ఆయన విగతజీవిగా మారారు.
అఖిలేశ్‌ను ఆయన స్నేహితులు, బంధువులు ముద్దుగా అఖిల్ అని పిలుస్తారు. ఆయనది అందమైన కుటుంబం. తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు తమ్ముళ్లు, సోదరి ఉన్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి మాత్రమే కుటుంబాన్ని కలుసుకున్నాడు.
అఖిలేశ్‌కు 2017లో పైలట్‌గా విధుల్లో చేరారు. 2018లో ఆయన వివాహం జరిగింది. ఆయన కుటుంబం ప్రస్తుతం యూపీలోని మథురలో నివాసం ఉంటోంది. అఖిలేశ్ భార్య మేఘ ప్రస్తుతం నిండు గర్భిణి. మరి కొన్ని రోజుల్లో వాళ్లింటికి బిడ్డ రాబోతుంది. కానీ, ఇప్పుడు కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అఖిలేశ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. బాధాకరమైన విషయం ఏమిటంటే కుటుంబసభ్యులు ఇప్పటికీ ఆయన భార్య మేఘకు ఈ దుర్వార్తను తెలియనివ్వలేదు.
‘కోజికోడ్‌లో విమాన ప్రమాదం జరిగిందని, విధుల్లో ఉన్న అన్నయ్య అఖిలేశ్‌కు గాయాలు అయ్యాయని తొలుత మాకు సమాచారం అందింది. రాత్రి పొద్దుపోయాక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు తెలిసింది. మా వదిన నిండు గర్భిణి కావడంతో ఈ విషయం ఆమెకు చెప్పలేదు. విమాన ప్రమాదంలో అన్నయ్య గాడపడ్డారని, హాస్పిటల్‌లో కోలుకుంటున్నారని చెప్పాం. మరో అన్నయ్య భువనేశ్, బావమరిది సంజీవ్ శర్మ కోజికోడ్‌కు బయల్దేరి వెళ్లారు’ అని అఖిలేశ్ సోదరుడు లోకేశ్ కుమార్ తెలిపాడు.
శుక్రవారం (ఆగస్టు 7) రాత్రి జరిగిన కోజికోడ్ విమాన ప్రమాదంలో పైలట్, కో-పైలట్ సహా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. దుబాయ్ నుంచి 191 మంది ప్రయాణికులతో కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఎయిరిండియా విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. రన్ వే పైనుంచి జారిపోయి 35 అడుగుల లోయలోకి దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
