ఎర్రకోట నుంచి మోడీ ఇచ్చిన సందేశంలో ఏముంది?

0

దేశానికి స్వాతంత్య్రతం వచ్చి డెబ్భై నాలుగేళ్లు అయ్యింది. ఇప్పటివరకు జరిగిన వేడుకలకు ఈసారి జరుగుతున్న వేడుకలకు కచ్చితమైన తేడా ఉంది. ఏడోసారి జాతీయ జెండాను ఎగురువేసిన మోడీ.. దేశ ప్రజల్ని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించారు. కరోనా కారణంగా రోటీన్ కు భిన్నంగా ఎర్రకోట పరిసరాలు కనిపించాయి. వేడుకల వేళ పెద్ద ఎత్తున హాజరు కావటంతో కళకళలాడేవి. తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా వేడుకలకు కేవలం 150 మందినే అనుమతించారు. వేడుకల్ని చూసేందుకు నాలుగువేల మందికే ఓకే చెప్పారు. దీంతో.. ఎర్రకోట ప్రాంగణమంతా బోసిపోయినట్లుగా కనిపించింది.

ఇదిలా ఉంటే.. ప్రధాని మోడీ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజపూరితంగా సాగింది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు.. సంస్కరణలతో పాటు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలన్న అంశాన్ని తనదైన శైలిలో ప్రస్తావించారు. మోడీ ప్రసంగంలో కీలకమైన అంశాల్ని చూస్తే..

– పాతికేళ్లు వచ్చిన ప్రతి బిడ్డ సొంతకాళ్లపై నిలబడాలని కుటుంబం కోరుకుంటుంది. 75ఏళ్ల తర్వాత కూడా భారత్ స్వయం సమద్ధి సాధించలేకపోయింది. ఈ క్షణం నుంచి బలమైన సంకల్సంతో ముందుకు వెళ్లాలని.

– ఇప్పుడు ప్రపంచం పరస్పరం ఆధారితం. ఎవరూ ఒక్కరుగా ఏకాకిగా మనలేరు. భారత్ అంటే కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు.. ఉన్నత విలువలతో కూడిన జీవనం.

– దేశ సరిహద్దుల్లో అంతర్గత భద్రతను కాపాడుతున్న సైనికులకు వందనం. ప్రపంచంతో పాటు దేశం కూడా విపత్కర పరిస్థితిలో ఉంది. కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.

– విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రణామం. వైద్యులు నర్సులు అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కృషి చేస్తున్నారు. కరోనా వారియర్స్కు శిరస్సు వంచి సలాం చేస్తున్నా.

– ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం నినాదం మాత్రమే కాకూడదు. మనందరి సంకల్పం కావాలి. దేశ యువత ఆత్మవిశ్వాసంతో ఆత్మరిర్భర్ భారత్ సాధించాలి.

– భారత్ను ఆకలిరాజ్యం నుంచి అన్నదాతగా మార్చారు. మన రైతులే స్ఫూర్తిగా అన్ని రంగాల్లో ఆత్మనిర్భర్ భారత్ సాధిద్దాం.

– కరోనాలాంటి విపత్కర సమయంలో యావత్ దేశం ఒక్కటై నిలిచింది. భారత్ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకప్పుడు భారత్ లో తయారైన వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దాం. భారత్ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందాం.

– మన వస్తువుల్ని మనమే గౌరవించుకోకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుంది. పీపీఈ కిట్లు.. ఎన్ 95 మాస్కులకు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది. నాలుగు నెలల్లో అందుకు భిన్నమైన పరిస్థితి. ఈ రోజున ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.

– వోకల్ ఫర్ లోకల్ అనే మాటను నిలబెట్టుకుందాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యవసాయం నుంచి బ్యాంకింగ్ వరకు అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రారంభించాం. ఎఫ్ డీఐల విషయంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోంది.

– ఎఫ్ డీఐల్లో గత ఏడాది 18 శాతం సాధించాం. ప్రపంచం మనపై ఉంచి విశ్వాసానికి ఇదో నిదర్శనం. ఆత్మవిశ్వాసంతో దేశం ముందుకు వెళుతోంది.

– స్వర్ణ చతుర్భతి దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.గడిచిన ఆరేళ్లలో సామాన్యుల జీవన ప్రమాణాల మెరుగుకు అనేక పథకాలు చేపట్టాం. ఉచిత గ్యాస్.. ఆహార ధాన్యాల పంపిణీ 80 కోట్ల మంది ఆకలి నుంచి దూరం చేశాయి. రైతుల ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు అవకాశం ఇస్తున్నాయి.

– స్వచ్ఛమైన తాగునీటితో సగం ఆరోగ్య సమస్యలకు సమాధానం చెప్ప వచ్చు. జల్ జీవన్ విషన్ తో ఆరోగ్య రంగంలో గొప్ప మార్పు వస్తుంది.