యుగపురుషునికి, ఆయన ఆశేష ఆభిమానులకు 99వ జన్మదిన, శత వసంతోత్సవ శుభాకాంక్షలు,Click for NTR Rare Pics.

లండన్‌లో కేటీఆర్, జగన్‌ కీలక భేటీ!? ముందస్తు ఎన్నికలపై సమాలోచనలు!!

0

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలే వేగంగా మారుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోమారు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుండగా, ఆయన బాటలోనే నడవాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడి భావిస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయని అంతా భావించారు. ఇటీవలి కాలంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలపై ప్రచారం జోరందుకుంది. ఈ ఊహాగానాల నడుమ ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనయుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లండన్‌లో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భేటీలో ముందస్తు ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించినట్లు జగన్‌ ఈ భేటీలో కేటీఆర్‌కు తెలిపినట్లు సమాచారం.

ముందుకు వెళ్తేనే మేలని..

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, వైసీపీ ముఖ్యనేతల కామెంట్స్‌ జగన్‌ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఏపీలో రెండేళ్ల ముందుగానే ఎన్నికల హాడవుడి మొదలైంది. ఒక వైపు ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోనే ఉంటుంటే మరోవైపు అధికార వైసీపీ నేతలు కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు రోజుకో రోడ్‌షో నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఈమేరకు టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది చూసి చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు.

రెండేళ్ల ముందే..

ఇదిలా ఉంటే జగన్‌ సరాకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయినా ముందస్తుకు వెళ్లడమే మేలని జగన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు పార్టీ ముఖ్యనేతలు బయటకు చెప్పకపోయినా.. అంతర్గతంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు సంకేతమే అని పేర్కొంటున్నారు. అన్నీ కలిసి వస్తే ఈ ఏడాది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో సీఎం జగన్‌ అసెంబ్లీని రద్దు చేయవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే జగన్‌ గడప గడపకూ మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. తెలుగు దేశం కూడా జగన్‌ ముందస్తు వ్యూహాన్ని పసిగట్టింది. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇటీవల కుప్పంలో పర్యటించినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరూ ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. త్యాగాలకు కూడా టీడీపీ సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో పొత్తు కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లుగా ఉన్న బీజేపీని కూడా తమ కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను కూడా ఆయన జన సేనానికే అప్పగించినట్లు సమాచారం.

ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి..

ప్రభుత్వం వ్యతిరేక పార్టీలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కట్టుదిట్టమైన వ్యూహాలు చరిస్తున్నాయి. మరో వైపు జగన్‌ ప్రతిపక్ష వ్యూహాలును దెబ్బకొట్టేందుకు ఢిల్లీ స్థాయిలోనే పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత అడ్రస్‌ లేకుండా పోయిన కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడు మళ్లీతెరపైకి తీసుకొచ్చి కొంతైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చగలిగితే ప్రతిపక్ష పార్టీల వ్యూహానికి అడ్డుకట్ట వేయవచ్చన్న ఆలోచనలో జగన్‌ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తెరపైకి తెచ్చింది జగన్‌ పార్టీ నేతలనే టాక్‌ వినిపిస్తోంది.

డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ రద్దు?

తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్‌ వచ్చే డిసెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్‌ ముందస్తున వ్యూహాన్ని గుర్తించిన ప్రతిపక్షాలు ఇప్పటికే అధికార టీఆర్‌ఎస్‌ కంటే ఒక అడుగు ముందే జనంలోకి వెళ్లాయి. ఇది కేసీఆర్‌కు కొంత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు పీకే ఇచ్చిన సర్వే రిపోర్టు కూడా కేసీఆర్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఢిల్లీ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు టాక్‌. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ సమ్మీటలో పాల్గొనేందకు వెళ్తూ మార్గమధ్యంలో ఫ్లైట్‌న లండన్‌లో ల్యాండ్‌ చేయించారు. అప్పటికే లండన్‌ చేరుకున్న కేటీఆర్‌తో రహస్యంగా భేటీ కూడా అయ్యారని సమాచారం. అన్నీ అనుకూలిస్తే నవంబర్‌లో జగన్, డిసెంబర్‌లో కేసీఆర్‌ ప్రభుత్వాలను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.