Templates by BIGtheme NET
Home >> Telugu News >> 30ఏళ్ల అనుబంధం తెంచుకున్న ఎల్.రమణ

30ఏళ్ల అనుబంధం తెంచుకున్న ఎల్.రమణ


ఒకటి కాదు.. రెండు.. కాదు.. ఏకంగా 30 ఏళ్ల అనుబంధం.. పార్టీ పుట్టినప్పటి నుంచి.. చేరినప్పటి నుంచి తెలంగాణ తెలుగుదేశం మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీ మారలేదు. పచ్చ కండువా తీయలేదు. కానీ దురదృష్టం ఆయన ఉందామన్నా.. తెలంగాణలో టీడీపీ లేకుండా పోయింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక పార్టీని వీడాల్సి వచ్చింది.

తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజానామా చేసేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబుకు ఎల్.రమణ పంపారు.

టీఆర్ఎస్ నుంచి బీసీ అయిన ఈటల రాజేందర్ వెళ్లిపోయారు. ఇప్పుడా స్థానంలోకి అదే బీసీ చేనేత వర్గానికి చెందిన ఎల్.రమణను తీసుకురావాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు నిన్న మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రగతి భవన్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణను రప్పించారు. అయితే చర్చలు ముగిసి టీఆర్ఎస్ లో చేరికకు ఎల్.రమణ ఒప్పుకున్నారు.

సామాజిక తెలంగాణ కోసం ముందుకు వెళ్లాలని కేసీఆర్ చెప్పారని.. తనతోపాటు కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు ఎల్.రమణ నిన్న చెప్పారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా నిర్ణయం ఉంటుందని కేసీఆర్ కు చెప్పానని ఎల్.రమణ మీడియాకు వివరించారు.

ఇక ఎరబ్రెల్లి కూడా మాట్లాడారు. చేనేత కుటుంబం నుంచి వచ్చిన రమణ అవసరం టీఆర్ఎస్ కు ఉందన్నారు. రమణను టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని.. రమణ సానుకూలంగా స్పందించారన్నారు.

ఈ క్రమంలోనే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు ఎల్. రమణ రెడీ అయ్యారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పాటునందించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా రమణ కృతజ్ఞతలు తెలుపడం విశేషం. తనను నాయకుడిని చేసిన చంద్రబాబును పార్టీ వీడుతూ కూడా రమణ స్మరించుకున్నారు.

రమణ ఎగ్జిట్ తో తెలంగాణ రాజకీయాల నుంచి పూర్తిగా తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యే ప్రమాదంలో పడింది. తెలంగాణ టీడీపీ చీఫ్ ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు డిసైడ్ అయిపోయారు. రెండు మూడురోజుల్లోనే చేరనున్నారు.

రమణ టీడీపీని వీడడానికి భవిష్యత్ లేకపోవడమే కారణం.. తెలంగాణలో టీడీపీ మరుగునపడిపోయింది. నేతలంతా వివిధ పార్టీల్లో చేరిపోయారు.ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో టీడీపీలో భవిష్యత్ లేదని గ్రహించిన రమణ టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.. టీఆర్ఎస్ కూడా పలు హామీలు ఇవ్వడంతో ఆయన చేరికకు ఓకే చెప్పారని తెలుస్తోంది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇటీవలే టీఆర్ఎస్ మంత్రి పదవికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి వైదొలగించారు. పోయిన బీసీ నేత స్థానంలో అదే బీసీ వర్గానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కీలక నేత అయిన రమణను కేసీఆర్ భర్తీ చేయబోతున్నారు.

ఈటలకు ప్రత్యామ్మాయంగా బీసీ నేతను తీసుకోవాలని టీఆర్ఎస్ ఎల్. రమణకు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవసరమైతే మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎల్.రమణ పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ కన్వీనర్ గా మంత్రిగా పనిచేశారు.గత కొంతకాలంగా టీఆర్ఎస్ తోపాటు బీజేపీ నేతలు ఎల్. రమణతో చర్చలు జరుపుతున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ వైపే వెళ్లడానికి ఎల్. రమణ డిసైడ్ అయ్యారు.