బెంగళూరు అల్లర్లు: ఎమ్మెల్యే ఇంటిపై మూక దాడి.. పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి

0

బెంగళూరు నగరంలో మంగళవారం రాత్రి పొద్దుపోయాక హింసాత్మక ఘటనలు తలెత్తాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా ఎమ్మెల్యే బంధువు ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారంటూ అల్లరి మూక దాడులు చేయడంతో బెంగళూరు నగరం అట్టుడికింది. అల్లర్లను అదుపులోకి తేవడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. కేజీ హల్లి, డీజే హల్లి, భారతి నగర్, పులికేశి నగర్, బాన్సవాడి పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. నగరం అంతటా 144 సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేశారు.

కవలబైరసంద్రలోని పులికేశినగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సమీప బంధువు ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టును వ్యతిరేకిస్తూ.. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో అల్లరి మూక ఎమ్మెల్యే ఇంటిపై మూక దాడికి పాల్పడింది. వారిని సముదాయించేందుకు బెంగళూరు ఈస్ట్ డీసీపీ శరణప్ప సహా సీనియర్ అధికారులు ప్రయత్నించారు. కానీ పులకేశి నగర్, భారతి నగర్, కమర్షియల్ స్ట్రీట్, టన్నెరీ రోడ్‌లో ఉన్న దుకాణాలను మూసి వేయాలని అల్లరి మూక బలవంతం చేసింది.

అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, బాటిళ్లు రువ్వడంతోపాటు పలు వాహనాలకు నిప్పు అంటించారు. ఈ ఘటనలో 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో ముందుగా గాల్లో కాల్పులు జరిపామని కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. కేజీ హల్లి, డీజే హల్లి స్టేషన్ల వైపు అల్లరి మూకలు పోగయ్యారు. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గేట్లకు తాళాలు వేసి స్టేషన్ ముందు నిలిపి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలు పది వాహనాలకు నిప్పు పెట్టాయి.

‌ఈ అల్లర్ల విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది దుండగుల చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. అందరూ శాంతిని పాటించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మయి ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్ప‌డిన‌ వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌న్నారు.