Templates by BIGtheme NET
Home >> Telugu News >> జీహెచ్ ఎంసీ వార్….కొత్త రూల్స్ ఇవే

జీహెచ్ ఎంసీ వార్….కొత్త రూల్స్ ఇవే


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో జంట నగరాల్లో ఎన్నికల సందడి మొదలైంది. బల్దియా బరిలో తమ సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి మరో పదిరోజులు మాత్రమే డెడ్ లైన్ ఉండడంతో వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల నిబంధనలు నియమావళిలో కొన్ని మార్పులు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ సారి ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున ఓటరు స్లిప్పుల పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది. ఈసీనే స్వయంగా ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తుందని పోలింగ్ స్టేషన్ల దగ్గర స్లిప్పుల పంపిణీ వద్దని పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు పలు నిబంధనలతో కూడిన నియమావళిని ఈసీ వెల్లడించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలమీద రాత ప్రకటనలు పోస్టర్లు పేపర్లు అంటించడం ప్రభుత్వ భవనాలను పాడు చేయడం నిషేధం

పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో పార్టీలన్నీ అవకాశమున్నంత వరకు ప్లాస్టిక్ పాలిథిన్ పోస్టర్లు బ్యానర్ల వాడకం నివారించాలి

ఎన్నికల కరపత్రం లేదా పోస్టరుపై సదరు ప్రింటరు పబ్లిషరు పేర్లు చిరునామాలు తప్పనిసరిగా ఉండాలి

ప్రత్యేక ఉపకరణాలు ధరించేందుకయ్యే ఖర్చంతా అభ్యర్థి తన వ్యయంలో చూపించాలి

పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రచారం కోసం సినిమాటోగ్రఫి టెలివిజన్ ఇతర ప్రచార సాధనాలు వాడడం నిషేధం

లౌడ్ స్పీకర్లు వాడేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరి. బహిరంగ సమావేశాలు రోడ్ షోలలో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య వేరే సందర్భాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లకు అనుమతి.

రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు బహిరంగ సమావేశాలపై నిషేధం. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సమావేశాలు ఊరేగింపులపై నిషేధం

అభ్యర్థులు అనధికారిక గుర్తింపు స్లిప్స్ ఇవ్వడంపై నిషేధం