గవర్నర్ తో నిమ్మగడ్డ.. మరో అనూహ్య నిర్ణయం

0

స్థానిక సంస్థల సాక్షిగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ వర్సెస్ జగన్ సర్కార్ పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చెనెలలో నాలుగు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిమ్మగడ్డ నోటిఫికేషన్ జారీ చేయగా.. నిన్న హైకోర్టు కొట్టివేయడం సంచలనమైంది. అయితే దీనిపై డివిజన్ బెంచ్ కు నిమ్మగడ్డ వెళ్లారు. ఇప్పుడు తదుపరి కార్యాచరణ వైపు కదులుతున్నారు.

ఈ క్రమంలోనే నిమ్మగడ్డ తాజాగా ఏపీ గవర్నర్ ను కలవడానికి రెడీ అయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలుసుకోనున్నారు. ఈరోజు గవర్నర్ ను 11.30 గంటలకు కలవనున్నారు. ఈ మేరకు అపాయింట్ మెంట్ కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం రెండో విడత అమ్మఒడి పథకాన్ని ఈరోజు ప్రారంభించడంపై తీవ్ర అసహనాన్ని నిమ్మగడ్డ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మఒడిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు నిమ్మగడ్డ వెళ్లినట్లు సమాచారం.

జగన్ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని.. ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక సంక్షేమ పథకాన్ని అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.

పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దుపై డివిజన్ బెంచ్ కు నిమ్మగడ్డ నిన్న సవాల్ చేశారు. ఈ పిటీషన్ పై ఈరోజు విచారణ జరుగనుంది. హైకోర్టుకు నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై వివరించనున్నారు. ఈరోజు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.