21 నుంచి స్కూళ్లు ఓపెన్ కు ఓకే.. కండీషన్స్ అప్లై

0

ఇటీవల కాలంలో యావత్ ప్రపంచం ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితిని కరోనా తీసుకొచ్చింది. ఒకే సమయంలో ఒకే విధమైన సమస్యను మానవాళి ఎదుర్కోవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గతంలో వైరస్ కారణంగా ఇబ్బందులు తలెత్తినా.. ఇప్పటి మాదిరి కాదని చెప్పక తప్పదు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించటం.. తర్వాతి కాలంలో అన్ లాక్ పేరుతో సిరీస్ రన్ చేస్తున్న కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 21 నుంచి స్కూళ్లు తెరిచేందుకు ఓకే చెప్పింది.

కాకుంటే.. అందుకు అనుసరించాల్సిన విధివిధానాల్ని స్పష్టం చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్ని అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు పాటించాలని స్పష్టం చేశారు. కేంద్రం పేర్కొన్న మార్గదర్శకాల్ని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు.. స్కూల్ సిబ్బంది అందరూ పాటించాల్సి ఉంటుంది.

విధివిధానాలు ఇవే..

– భౌతిక దూరానికి అమిత ప్రాధాన్యత. ఆరు అడుగుల దూరం పాటించాల్సిందే.

– నోటిని కప్పి ఉంచే మాస్కును ఎల్లప్పుడు ఉపయోగించాల్సిందే

– తరచూ చేతుల్ని సబ్బుతో కానీ ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ను వినియోగించాలి

– తుమ్ము కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు అయితే చేతిరుమాలు.. లేదంటే టిష్యూ పేపర్ ను వాడాలి

– వాడేసిన టిష్యూ పేపర్ ను కచ్ఛితంగా డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలి.

– గతంలో మాదిరి ఉమ్మి వేయటం అన్నిచోట్ల కచ్ఛితంగా నిషేధం అమల్లో ఉండాలి

– ఆరోగ్య సేతు యాప్ ను వీలైనంతవరకు అందరు వాడాలి

– తొమ్మిది తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అన్ని పాఠశాలల్ని ఏర్పాటు చేయాలి

– ఆన్ లైన్ విద్యా విధానాన్ని కూడా అమలు చేయొచ్చు.

– పాఠశాలలకు విద్యార్థుల్ని అనుమతించాలంటే.. వారి తల్లిదండ్రుల వద్ద తప్పనిసరిగా అనుమతి అవసరం

– కంటైన్ మెంట్ జోన్ లేని చోట్ల మాత్రమే స్కూళ్లను తెరుస్తారు

– కంటైన్ మెంట్ జోన్ లేని ప్రాంతాల్లోని విద్యార్థులు.. ఉపాధ్యాయులు.. స్కూలు సిబ్బందిని అనుమతించాలి

– స్కూళ్లు ఓపెన్ చేయటానికి ముందు స్కూల్ లోని అన్ని ప్రాంతాల్ని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో క్లీన్ చేయాలి

– ఉపాధ్యాయులు.. విద్యార్థుల మధ్య దూరం 6 అడుగుల కంటే ఎక్కువగా ఉండేటా సీటింగ్ ఏర్పాటు చేయాలి

– క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించిన స్కూళ్లను మరింత ఎక్కువగా శుభ్రపర్చాలి.

– పాఠశాలల్లో 50 శాతం మాత్రమే భోదన.. బోధనేతర సిబ్బందిని పిలవాలి.

– స్కూళ్లలో బయోమెట్రిక్ బదులుగా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకోవాలి