అమరావతికి పొలిటికల్‌ ‘సెగ’.!

0

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అమరావతికి వెళుతున్నారు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌లోనే వుండిపోయిన జనసేనాని, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని మంగళగిరిలో వున్న పార్టీ కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశాలతోపాటుగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. కొన్ని రోజులపాటు జనసేన అధినేత అమరావతిలోనే వుంటారని తెలుస్తోంది.

పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విషయం విదితమే. ఈ కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైందని పార్టీ వర్గాలు అంటున్నారు. కాగా, మూడు రాజధానులు సహా, రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ దిశా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, పోలవరం ప్రాజెక్టు విషయమై చెలరేగుతున్న గందరగోళం నేపథ్యంలో జనసేన – బీజేపీ నేతల సమావేశం కూడా విజయవాడలో జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ – వైసీపీ ఆడుతున్న ‘పొలిటికల్‌ గేమ్’ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుపై స్పష్టత కోసం డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఇదిలా వుంటే, పోలవరం ప్రాజెక్టు ఎత్తుని 41 మీటర్లకే పరిమితం చేసేలా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నుంచి లీకులు అందుతుండడం, వైసీపీ అనుకూల మీడియాలోనూ అందుకు అనుగుణంగా కథనాలు వస్తుండడం, వీటిపై తెలుగుదేశం పార్టీ ‘డ్రమెటిక్‌ ఆందోళన’ వ్యక్తం చేయడం, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాజకీయం.. వీటన్నిటి పట్లా ఇటు బీజేపీ, అటు జనసేన అప్రమత్తమయ్యాయి.

ఇంతలోనే, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గబోదనీ, ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చి, ప్రాజెక్టు ఎత్తుని చంద్రబాబు కొలుచుకోవచ్చంటూ ఎద్దేవా చేయడం గమనార్హం. చంద్రబాబుపై విమర్శల సంగతి పక్కన పెడితే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ప్రాజెక్టు ఎత్తుకి సంబందించి 41 మీటర్ల చుట్టూనే అధికారులకు దిశా నిర్దేశం చేయడమేంటి.? అసెంబ్లీలో వైఎస్‌ జగన్‌ చెప్పినట్లు ‘ఆ పత్రికలో తప్పు రాశారు అధ్యక్షా’ అనుకోవాలా.? ఏమో, అన్ని లెక్కలపైనా జనసేన అధినేత అమరావతి టూర్‌లో స్పష్టత వచ్చే అవకాశం వుంది.

‘జాతీయ ప్రాజెక్టుపై.. రాష్ట్రంలోని అధికార పార్టీ పెత్తనమేంటి.?’ అన్న బీజేపీ వాదన.. అదే సమయంలో, ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం నుంచి స్పష్టత తీసుకోవాలన్న జనసేన ఆలోచన.. వీటన్నిటికీ జనసేనాని అమరావతి పర్యటనలో స్పష్టత రావొచ్చు.