నయాపైసా సాయం చేయని ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడటమేనా?

0

పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ ఇదే. ప్రకాష్ రాజ్ కావాలనే పవన్ పై విమర్శలు చేశారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు తెలుగు రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ప్రకాష్ రాజ్.. అకస్మాత్తుగా జనసేన-బీజేపీ పొత్తుపై మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహాలో మాట్లాడారు. ఇది మున్సిపల్ ఎలక్షనా? పార్లమెంట్ ఎలక్షనా? పక్క రాష్ట్రాల నుంచి ఎందుకు వస్తున్నారు అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇది ప్రకాష్ రాజ్ కి కూడా వర్తిస్తుందిగా అన్నది నెటిజన్ల ప్రశ్న.

ఇటీవల హైదరాబాద్ లో వరదలు వచ్చి అల్లకల్లోలమైతే.. చాలామంది తమకు తోచిన విరాళాలు అందించారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం నయాపైసా సాయం చేయలేదు. కర్ణాటకలో వరదలు వచ్చినప్పుడు విరాళమిచ్చిన ఆయనకు తెలుగు ప్రజల బాధలు పట్టలేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు లేకుంటే అంత పెద్ద నటుడు అయ్యేవారా అని నిలదీస్తున్నారు.

విరాళం ఇవ్వడం, ఇవ్వకపోవడం ఆయన వ్యక్తిగత విషయమే అనుకున్నా.. ఎవరు ఎవరికి మద్దతివ్వాలో ప్రకాష్ రాజ్ చెప్పడం ఏమిటని మండిపడుతున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే బీజేపీతో జనసేన కలిసి పనిచేసింది. 2019 ఎన్నికల్లో జనసేన సొంతంగా పోటీచేసినా.. ఎన్నికల తర్వాత అధికారికంగానే బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ అదే పార్టీతో అవగాహనకు వచ్చింది.

వ్యక్తిగతంగా టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ప్రకాష్ రాజ్ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అయినప్పుడు.. ఓ రాజకీయ పార్టీ అధినేతగా ఏ పార్టీకి మద్దతివ్వాలనే నిర్ణయం పవన్ కల్యాణ్ తీసుకోవడం కూడా కరెక్టేనని స్పష్టంచేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన పలు విషయాలు బయటకొస్తున్నాయి. ఆయన గతంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వెనకబడిన పాలమూరు జిల్లాలో ఆయన గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

అయితే, తాజాగా ఇందుకు గల కారణాలు బయటకొస్తున్నాయి. ఆ గ్రామానికి సమీపంలోనే ప్రకాష్ రాజ్ ఫాంహౌస్, భూములు ఉన్నాయి.. వాటిని కాపాడుకోవడానికే టీఆర్ఎస్ పెద్దల మద్దతు కోరి, ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి వీటిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.