విశాఖ ఉక్కును పక్కన పెట్టి.. పోస్కుకు మోడీ సర్కారు దన్ను

0

హైగ్రేడ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామనే ఆ కంపెనీకి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి చెందిన విలువైన భూముల్ని పోస్కోకు కట్టబెట్టేలా కేంద్రం నిర్ణయాలు ఉండటం గమనార్హం. ఇదే కంపెనీ ఒడిశాలో పదిహేనేళ్లు పాటు ప్రయత్నించింది. అయినా.. సాధ్యం కాలేదు. కానీ.. విశాఖ ఉక్కు కర్మాగారానికి దగ్గరగా ఉన్న భూముల్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఏడాదికి 50 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసేందుకు 1170 ఎకరాలు కావాలని కంపెనీ కోరింది. ఇందుకోసం తాము రూ.35వేల కోట్ల పెట్టుబడి పెడతామని చెబుతోంది.

ఇప్పటివరకు ఆ కంపెనీకి 900 ఎకరాల భూమిని కేంద్రం కట్టబెట్టింది. అయితే.. విలువైన భూముల్నిపోస్కోకు ఎంతకు అమ్ముతున్నారో ఇప్పటికి అర్థం కావటం లేదు. మరోవైపు తమకు కేటాయించిన భూములపై పోస్కో పెద్ద ఎత్తున రుణాలు తెచ్చుకునేందుకు అనుమతులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదంతా చూస్తే.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ను పక్కన పెట్టి ప్రైవేటు సంస్థ ప్రయోజనాల కోసం ఇంతలా తపించటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.