చిరంజీవి – నాగార్జునలతో కేసీఆర్.. ఏమన్నాడంటే?

0

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ టాలీవుడ్ ను మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డారు. ఈ మేరకు టాలీవుడ్ పెద్దలతో మరోసారి కీలక భేటి నిర్వహించారు. టాలీవుడ్ కు హామీలు కురిపించారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు చిరంజీవి నాగార్జున నారంగ్ దామోద్ ప్రసాద్ సి కళ్యాణ్ సహా కీలక టాలీవుడ్ ప్రముఖులతో భేటి అయ్యారు.

కరోనా కారణంగా సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని సీఎం కేసీఆర్ కు సినీ పెద్దలు వివరించారు. కరోనా కారణంగా షూటింగ్ బంద్ అయిపోయి.. థియేటర్లు మూతబడి సినీ పరిశ్రమకు కార్మికులకు జరిగిన నష్టం గురించి విన్నవించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ పరంగా రాయితీలు మినహాయింపులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.

టాలీవుడ్ ను పరిశ్రమను కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని.. దేశంలో ముంబై చెన్నై తర్వాత హైదరాబాద్ నగరంలోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందని కేసీఆర్ అన్నారు. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతోందన్నారు.

ఇటు ప్రభుత్వం అటు సినిమా పరిశ్రమ పెద్దలు కలిసి పరిశ్రమను కాపాడుకోవడానికి సంయుక్తంగా ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వపరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను కూడా పెట్టామని కేసీఆర్ సినీ పెద్దలకు హామీ ఇచ్చారు. త్వరలోనే చిరంజీవి ఇంట్లో సమావేశమై సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చించాలని నిర్ణయించారు.