Templates by BIGtheme NET
Home >> Telugu News >> అమిత్ షాతో రజినీకాంత్ భేటి? బీజేపీలో చేరిక?

అమిత్ షాతో రజినీకాంత్ భేటి? బీజేపీలో చేరిక?


కేంద్రంలోని బీజేపీ ఇప్పుడు తమిళ రాజకీయాల వైపు దృష్టిసారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. చెన్నైలో మకాం వేశారు. పొత్తుల కోసం ఎత్తులు వేస్తున్నారు.

అధికారంలో ఉన్న అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకొని బీజేపీ మిగిలిన పార్టీలు వ్యక్తుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అలాగే ప్రతిపక్షాలను చీల్చే యోచనలో చీలికలకు యత్నాలు చేస్తున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.

ఈ క్రమంలోనే దక్షణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ను పార్టీలో చేర్చుకునే దిశగా బీజేపీ వ్యూహాలను రూపొందిస్తోందని తెలుస్తోంది. ఆయనతోపాటు దివంగత మాజీ సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరిని కూడా పార్టీ కండువా కప్పే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రెండు రోజుల పాటు చెన్నైలో ఉండనున్న అమిత్ షా ఖచ్చితంగా ఈ పర్యటనలో రజినీకాంత్ తోపాటు అళగిరిని కలుస్తారనే ప్రచారం ఉంది. బీజేపీ పెద్దల విజ్ఞప్తి మేరకు కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనను రజినీకాంత్ విరమించుకున్నారంటూ వార్తలు వచ్చాయి. బీజేపీని నరేంద్రమోడీని గతంలో రజినీకాంత్ సమర్థించిన సందర్భాలు ఉన్నాయి.

బీజేపీలో చేరితే రజినీకాంత్ కు అత్యున్నత పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయవచ్చని అంటున్నారు. కాబట్టి రజినీకాంత్ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక కరుణానిధి కుమారుడు స్టాలిన్ సోదరుడు అళగిరిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా డీఎంకేకు పడే ఓట్లను చీల్చవచ్చని బీజేపీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలతో డీఎంకే ఓటు బ్యాంకును చీల్చడానికి అళగిరి ఉపయోగపడుతాడని బీజేపీ భావిస్తోంది.