తలైవా బాగున్నారు.. తప్పుడు వార్తలు నమ్మకండి..!

0

సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేదని.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొంతకాలంగా సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్నా రాజకీయపార్టీ కార్యకలాపాలు ప్రారంభించడం లేదని ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. తన ఆరోగ్యపరిస్థితిపై రజనీకాంతే స్వయంగా తన అభిమానులకు రాశారంటూ ఓ లేఖ కూడా బయటకు విడుదలైంది. ఈ లేఖను రజనీకాంత్ కూడా ఖండించలేదు.. మరోవైపు రాజకీయాలపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన అభిమానులు తమిళ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమేనని నమ్ముతున్నారు.

మరోవైపు రజనీ పార్టీమీద కూడా ఎటువంటి కార్యకలాపాలు తమిళనాట సాగడం లేదు. ఆయన అభిమానుల హడావుడి కూడా తగ్గిపోయింది. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తాను.. అంటూ తలైవా ప్రకటించారు. కానీ అది ఎప్పుడు అనే విషయంపై మాత్రం ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఆయన ఆరోగ్యంపై కూడా పుకార్లు వచ్చాయి. ఈ సారి ఎన్నికల్లో రజనీ పోటీచేయకపోతే.. ఇంకెప్పుడూ పోటీచేయలేరన్న విశ్లేషణలు వినిపించాయి. ఎన్నికలకు కూడా కొద్ది సమయం మాత్రమే మిగిలిఉంది. పొలిటికల్ ఎంట్రీపై ఆయన అభిమానులు తమిళ ప్రజలు ఆశలు వదులుకున్నారు.

కానీ ఆయన ఆరోగ్యం ఎలా ఉందన్న విషయంపై మాత్రం గందరగోళం నెలకొన్నది. దీంతో రజనీకాంత్ పీఆర్ టీమ్ స్పందించింది. ‘రజనీకాంత్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన ఇప్పుడు పోయెస్ గార్డెన్లోని తన నివాసంలోనే ఉన్నారు’ అని వారు క్లారిటీ ఇచ్చారు.దీంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు రజనీకాంత్ ఇటీవల దీపావళి వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రజనీ చిన్న కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తేలో అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అలనాటి నటీమణులు ఖుష్బూ మీనా ప్రధానపాత్ర పోషిస్తుండగా కీర్తి సురేశ్కూడా నటిస్తున్నట్టు సమాచారం.